Pulivendula YSRCP office Police : పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా పోలింగ్ బూత్‌ల వద్ద ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వైసీపీ కార్యాలయం వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉదయం అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి ఎర్రగంట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. మధ్యాహ్నం సమయంలో అవినాష్ రెడ్డి పోలీసులకు చెప్పకుండా వైఎస్ఆర్‌సీపీ ఆఫీసుకు వచ్చేశారు. దీంతో పోలీసులు ఆయనను వెదుక్కుంటూ పులివెందుల వైసీపీ ఆఫీసుకు వచ్చారు. డీఐజీ కోయ ప్రవీణ్ కూడా వైసీపీ ఆఫీసుకు వచ్చారు. ఆయన వచ్చిన సమయంలో వైసీపీ కార్యకర్తలు అడ్డం నిలబడ్డారు. వారిని తప్పించుకుని కార్యాలయం తలుపు వద్దకు వెళ్లినా కాసేపు తీయలేదు.
అవినాష్ రెడ్డిని మరోసారి అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు కూడా వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కొంత మంది కార్యకర్తలు పోలీసుల్ని లోపులకు వెళ్లడానికి అంగీకరించకుండా అడ్డం నిలబడ్డారు. ఈ సమయంలో డీఎస్పీ మురళీనాయక్ తో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఆగ్రహం చెందిన డీఎస్పీ.. కాల్చిపడేస్తాను.. యూనిఫాం ఇక్కడ అని హెచ్చరించారు. ఆయన హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తర్వాత పులివెందుల వైసీపీ ఆఫీసులోనికి డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లారు. అవినాష్ రెడ్డితో సమావేశం అయ్యారు. పోలింగ్ ముగిసే వరకూ బయటకు రావొద్దని ఆయనపై పోలీసులు ఆంక్షలు విధించారు.
పులివెందులలో ప్రశాంతమైన పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా చూసుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దగ్గర కొంత మంది దాడులు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో అన్ని పార్టీల ప్రముఖ నేతల్ని పోలింగ్ కు ముందు హౌస్ అరెస్టు చేశారు. వారు పోలింగ్ కేంద్రాల వద్ద తిరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీరు తిరగడం ఆపేస్తే చాలా వరకూ ఘర్షణలు తగ్గుతాయని అనుకున్నారు. అయితే అవినాష్ రెడ్డి మధ్యాహ్నమే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రావడంతో .. ఆయనను కలిసేందుకు కార్యకర్తలు పులివెందుల వైసీపీ ఆఫీసుకు రావడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.
ఉదయం నుంచి పోలింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. దొంగ ఓటర్లు వచ్చారని .. ఇతర ప్రాంతాల వారితో ఓట్లేయించారని ఆరోపించారు. అయితే పులివెందులలో ఏర్పాటు చేసిన పదిహేను పోలింగ్ బూత్‌లలో అన్ని పార్టీల ఏజెంట్లు ఉన్నారు. ఏజెంట్లు ఎవర్నీ బయటకు లాగేయలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రతి పోలింగ్ బూత్‌లో .. సీసీ కెమెరాలు పెట్టారు. వెబ్ కాస్టింగ్ చేశారు.