PM Modi AP Tour Cancelled due to bad Weather | న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన పర్యటన రద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ హెచ్చరికలతో మోదీ పర్యటన రద్దు అయినట్లు పీఎంవో తెలిపింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రధాని మోదీ తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. దాంతో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.


అనకాపల్లి పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ శంకుస్థాపనతో పాటు జాతీయ రహదారుల అంకితం, కొన్ని రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ స్టేడియంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ సైతం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తీవ్ర వాయుగుండంగా మారుతోంది. అనంతరం అది తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు చేసినట్లు ప్రధాని కార్యాలయం సోమవారం వెల్లడించింది.


ప్రధాని మోదీ శంకుస్థాపననలు, కార్యక్రమాలు ఇవీ


విశాఖ కేంద్రంగా భారీ పెట్టుబడుల పార్క్‌ ఏర్పాటుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ పార్క్‌ ఏర్పాటుతో రాష్ట్రానికి 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా  విశాఖలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన జరగనుందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పార్క్‌తో పాటు గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ల ఏర్పాటుకు సైతం ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం 1200 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టులతో వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో 48 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. 



Also Read: Total Night Village: వాళ్లకు సూర్యుడు కనిపిస్తే పండగే - చీకట్లేనే మగ్గే విలేజ్ - నార్వేలో ఈ వింత గ్రామం గురించి విన్నారా ? 


విశాఖలోని పూడిమడకలో శంకుస్థాపన చేయనున్న ఎన్టీపీసీ ప్రాజెక్టును మూడు దశలలో పూర్తి చేయనున్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్లు, విండ్, సోలార్‌ హైబ్రిడ్‌ పంప్డ్‌ స్టోరేజీకి అవసరమయ్యే 20 గిగా వాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల తెలిపారు. ఏపీ జెన్‌కోకు ఈ ప్రాజెక్టులో 50 శాతం భాగస్వామ్యం ఉంది. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుతో రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌తో ఒప్పందం గురించి చంద్రబాబు వివరించారు. టాటా గ్రూప్‌ సైతం విశాఖలో పెట్టుబడులు పెట్టబోతోంది. ఎల్‌జీ సంస్థ సైతం పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన 227 ఎంవోయూలతో ప్రయోజనం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చర్యల కారణంగా సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టలేదన్నారు.