Janasena invited for NDA meeting: జనసేన పార్టీకి, నేతలు కార్యకర్తలలో జోష్ నింపే విషయం ఇది. ఈ నెల 18న ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందింది. ఎన్డీఏలో భాగస్వాములైన రాజకీయ పక్షాల అగ్రనేతలు హాజరవుతున్న ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్ , పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరు కానున్నారు. పవన్ తో పాటు నాదెండ్ల జులై 17వ తేదీ సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. బీజేపీ అధిష్టానం నుంచి ఈ సమావేశానికి హాజరు కావాలని కొద్ది రోజుల కిందటే జనసేన పార్టీకి ఈ ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.


బీజేపీ కూటమి సమావేశానికి టీడీపీకి ఆహ్వానం
నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్ పేరుతో  బీజేపీ మిత్రపక్షాల కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది. విభజన హామీలు నెరవేర్చలేదని ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. అనూహ్యంగా టీడీపీకి ఎన్డీఏ  కూటమి సమావేశానికి రావాలని తెలుగుదేశం పార్టీకి  బీజేపీ ఆహ్వానం పంపింది. ఈ నెల పద్దెనిమిదో తేదీన ఢిల్లీలోని అశోకా  హోటల్‌లో ఎన్డీఏ పక్షాల కూటమి సమావేశం జరగనుంది. టీడీపీనే కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉండి బయటకు వెళ్లిపోయిన శోరోమణి అకాలీ దళ్‌తో పాటు.. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు నిర్వహిస్తే లోక్ జనశక్తి పార్టీని కూడా ఆహ్వానించారు. 


టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలి కాలంలో బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. కొద్ది రోజుల కిందట ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో పాటు జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం వివరాలేమీ బయటకు రాలేదు. చంద్రబాబునాయుడు కూడా బీజేపీతో  పొత్తుల అంశంపై ఎప్పుడూ స్పందించలేదు. ఓ జాతీయ మీడియా చానల్‌తో ఇటీవల మాట్లాడినప్పుడు మోదీ విధానాలను సమర్థిస్తానని.. ఎన్డీఏలో చేరికపై కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఆ తర్వాత బీజేపీ వైపు నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదు. కానీ ఇటీవల రాష్ట్రంలో రెండు బహిరంగసభలను నిర్వహించిన సందర్భంగా ఏపీలోని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై  అమిత్ షా, జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. 


టీడీపీ, జనసేనతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం కేంద్రంలోని ఎన్డీఏకు అనుకూల వైఖరితో ఉంటుంది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగనుండగా.. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ కొన్ని రోజుల కిందట వైసీపీ, ఎన్డీఏలో చేరుతుందని ప్రచారం జరిగింది. కేంద్ర కేబినెట్ విస్తరణలో వైసీపీకి చోటు దక్కుతుందని సైతం నేతల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణకు బీజేపీ అధిష్టానం కొత్త బాస్ లను నియమించింది. పురంధేశ్వరిని ఏపీ పార్టీ అధ్యక్షురాలిగా, తెలంగాణలో కిషన్ రెడ్డికి మరోసారి పార్టీ పగ్గాలు అప్పగించారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial