Money Theft at Bank in Guntur: మీరు డబ్బులతో వెళ్తున్నారా, లేక అప్పుడే బ్యాంక్ నుంచి క్యాష్ విత్ డ్రా చేసి వెళ్తున్నారా.. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులతో పాటు పోలీసులు ప్రజలకు పదే పదే సూచనలు చెబుతుంటారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, లేక అజాగ్రత్తగా కనిపించినా సరే.. ముందే ఓ కన్నేసి ఉంచిన కేటుగాళ్లు క్యాష్ బ్యాక్ తో ఉడాయిస్తారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. సినిమా సీన్లనే తలదన్నేలా కొందరు కేటుగాళ్లు చేసిన చోరీ చూస్తే షాక్ అవుతారు. పోలీసులు సైతం సీసీటీవీ ఫుటేజీ చూసి, నిందితులు పక్కాగా ప్లాన్ చేశారని నిర్ధారణకు వచ్చారు. సినిమాలో చూపించే చోరీ సీన్ ను ఉన్నది ఉన్నట్లు దింపేశారంటూ ఫుటేజీ చూసిన వాళ్లు చెబుతున్నారు.


అసలేం జరిగిందంటే..
హరిబాబు అనే వ్యక్తి బ్రాడిపేటలోని మిర్చి వ్యాపారి వద్ద గుమాస్తాగా పని చేస్తున్నాడు. మనీ విత్ డ్రా చేయాల్సి ఉందని యజమాని హరిబాబుకు చెప్పాడు. దాంతో గుంటూరులోని లక్ష్మీపురం హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకుకు క్లర్క్ హరిబాబు వెళ్లాడు. బ్యాంకు నుంచి రూ.10 లక్షల రూపాయలు విత్ డ్రా చేశాడు. ఆ నగదును తన వెంట తెచ్చుకున్న ఓ బ్యాగులో పెట్టుకుని తన బైకు వద్దకు వచ్చాడు. క్యాష్ విత్ డ్రా చేస్తాడని ముందుగానే తెలిసినట్లే కనిపించిన ఓ గ్యాంగ్ నగదు చోరీ చేసేందుకు బైకుల మీద వచ్చి నిఘా పెట్టారు.


క్యాష్ బ్యాగును బైకు మీద పెట్టి బండి స్టార్ట్ చేస్తుండగా ఓ నిందితుడు హరిబాబు వద్దకు వచ్చాడు. తన వద్ద ఉన్న రూ.20 నోటును కింద పడవేసి.. నోటు పడిపోయిందని నమ్మించాడు. బైకు దిగిన హరిబాబు ఇరవై రూపాయల నోటు తీసుకున్నాడు. అదే సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన మరో నిందితుడు సెకన్ల వ్యవధిలో క్యాష్ బ్యాగ్ తీసుకుని మరో బైకుపై అక్కడి నుంచి సినిమా సీన్ తరహాలో పరారయ్యారు. మరోసారి బైక్ స్టార్ట్ చేయబోయిన హరిబాబు క్యాష్ బ్యాగ్ లేదని గుర్తించాడు. తాను మోసపోయానని, దొంగలు ప్లాన్ ప్రకారం తనను ఏమార్చి నగదు చోరీ చేశారని గ్రహించాడు.
 
క్యాష్ విత్ డ్రా చేసి తీసుకుళ్తుంటే కొందరు ప్లాన్ ప్రకారం చోరీ చేశారని బాధితుడు హరిబాబు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. బ్యాగులో పది లక్షలు క్యాష్ ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంక్ తో పాటు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. కొందరు వ్యక్తులు మాస్క్ లతో వచ్చి బ్యాంకులో నిఘా ఉంచినట్లు గుర్తించారు. అనంతరం బాధితుడు హరిబాబు నగదుతో వెళ్తుంటే చాక చక్యంగా వ్యవహరించి తమ ప్లాన్ ప్రకారం క్యాష్ బ్యాగుతో పరారయ్యారని పోలీసులు తెలిపారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. నగదు, బంగారంతో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial