Pawan Kalyan Speech In Kattipudi: వచ్చే ఎన్నికల తర్వాత తాను అసెంబ్లీలో ఎలా అడుగు పెట్టనో చూద్దామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సవాలు విసిరారు. కచ్చితంగా జనసేన పాదముద్ర అసెంబ్లీలో పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే కక్ష కట్టి, తనను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వొద్దనే ఉద్దేశంతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఉంటే, మొత్తం లక్షా 8 వేల ఓట్లు పోలయ్యాయని అన్నారు. జనసేన పార్టీ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్రలో భాగంగా తొలి బహిరంగ సభను కాకినాడ జిల్లా కత్తిపూడి (Kattipudi) లో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార వైఎస్ఆర్ సీపీపై విమర్శలు చేశారు.
జనసేన కేంద్ర కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటుందని, మొత్తం రాజకీయం ఇక్కడి నుంచే చేస్తామని తేల్చి చెప్పారు. తాను విడిగా వస్తానో, వేరే పార్టీతో కలిసి వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి తాను ఎన్ని వ్యూహాలైనా అమలు చేస్తానని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని స్పష్టం చేశారు.
‘‘గత ఎన్నికల్లో నన్ను కనీసం గాజువాక నుంచి గెలిపించినా రుషికొండనైనా కాపాడి ఉండేవాడిని. ఎన్నికల్లో మద్యపాన నిషేధం అని చెప్పిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యంపైనే ఏడాదికి రూ.25 వేల కోట్ల ఆదాయం పొందుతోంది. సీపీఎస్ రద్దు చేస్తామని గొప్పగా చెప్పారు.. దాని గురించి పట్టించుకోవడం లేదు. అమరావతిలో రైతుల ఆత్మహత్యలకు వైసీపీ ప్రభుత్వమే కారణం. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిని ఎందుకు వ్యతిరేకించలేదు?’’
‘‘151 అసెంబ్లీ సీట్లున్న వైసీపీ అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని జనసేనను టార్గెట్ చేస్తోంది. దాన్ని బట్టే పార్టీ ఎంత బలంగా ఉందో అర్థమౌతోంది. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌లోనో, డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ఎన్నికలు రావని ముఖ్యమంత్రి జగన్ కథలు చెబుతున్నారు. ప్రభుత్వంలో కీలక పోస్టులన్నీ ఒక కులానికే పరిమితం చేయడం సరికాదు. అమరావతి ఒక కులానికే చెందినదని అనుకుంటే ఆనాడే జగన్ ఎందుకు వ్యతిరేకించలేదు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. వైసీపీకి పోలవరం ఏటీఎం లాంటిది.
‘‘ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం చాలా అవసరం. తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటా. రాజకీయాల్లో అక్రమంగా సంపాదించిన వ్యక్తులతోనే నా పోరాటం. నన్ను పాలించేవారు నా కంటే నిజాయితీపరుడై ఉండాలనే నా కోరిక’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.