Pawan Kalyan son Mark Shankar: సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ప్రమాదం జరిగిన రోజున పొగ ఊపిరి తిత్తుల్లోకి చేరడంతో శ్వాస పీల్చుకోవడానికి కూడా మార్క్ శంకర్ ఇబ్బందిపడినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఫైర్ ఫైటర్స్ రక్షించి.. ఆస్పత్రికి తరలించారు. దాంతో ఆస్పత్రిలో వెంటనే కృత్రిమ శ్వాస ఇచ్చి.. ఊపిరి తిత్తుల్లోకి వెళ్లిన పొగను క్లియర్ చేసేందుకు చికిత్స ప్రారంభించారు. ఆ పొగ .. ఎంత ఎక్కువ సేపు అవయవాల్లో ఉంటే అంత ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది. అందుకే పవన్ కల్యాణ్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా అందుకే తాము కూడా హుటాహుటిన సింగపూర్ వెళ్లారు.
సింగపూర్ లో పవన్ కల్యాణ్ సతీమణి పిల్లలను చదివిస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. బంధువులు ఎవరూ ఉండకపోవడం, కుమారుడికి ప్రమాదంతో ఆమె షాక్ కు గురయి ఉంటారని.. అందుకే ఆమెకు మానసికంగా మద్దతుగా ఉండేందుకు కుటుంబసభ్యులు కూడా వెళ్తే మంచిదన్న ఉద్దేశంతో వెళ్లినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి దంపతులే కాకుండా పలువురు కుటుంబసభ్యులు కూడా బుధవారం.. సింగపూర్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఒక రోజు ట్రీట్ మెంట్ తర్వాత వైద్యులు వారికి గుడ్ న్యూస్ చెప్పారు.
మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని.. ఊపిరి తిత్తుల్లోకి చేరిన పొగను..బ్రాంకోస్కోప్ ద్వారా బయటకు పంపేసినట్లుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. మార్క్ శంకర్..ఫోటోను రిలీజ్ చేశారు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా రిలీఫ్ ఫీలయ్యారు. పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత దాదాపుగా అందరూ స్పందించారు. మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రార్థించారు. వైసీపీ అధినేత జగన్, రోజా కూడా.. పవన్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే జనసేన పార్టీ వ్యతిరేకులు కూడా మంచి మనసుతో స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకుండా.. ఇలాంటి సుహృద్భావ వాతావరణం ఉంటే.. బాగుంటుందన్న అభిప్రాయాలు ఈ కారణంగానే వినిపించాయి. పవన్ కూడా అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.