Praja Galam in Pedana: భీమవరం నియోజకవర్గం నుంచి తాను పిఠాపురానికి వచ్చి పోటీ చేస్తుండడంపై సీఎం జగన్ బాధపడుతున్నారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. మరి అంత మంది వైసీపీ అభ్యర్థులను ఎందుకు మార్చారో జగన్‌ చెప్పాలని ప్రశ్నించారు. జగన్‌లో రోజు రోజుకు ఫ్రస్టేషన్ పెరుగుతోందని.. అందుకే భీమవరంలో తనపై విమర్శలు చేశారని అన్నారు. జగన్‌ మోహన్ రెడ్డి కూటమి నాయకులను తిట్టే కొద్దీ ఇంకా బలంగా తయారవుతామని.. అంతే తప్ప బలహీన పడబోమని పవన్‌ కల్యాణ్ ‌అన్నారు. కూటమిలోని పార్టీల మధ్య కొట్లాటలు పెట్టడం కోసం జగన్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని పవన్ అన్నారు. కృష్ణా జిల్లా పెడనలో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ మాట్లాడారు.


ఏపీలో బలమైన ప్రభుత్వం ఉన్నపుడే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. పదవుల కోసం కూటమి ఏర్పడలేదని ప్రజా సంక్షేమం కోసమని వివరించారు. మద్యనిషేదం చేస్తానని చెప్పి సారాను, కల్తీ మద్యాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రవహింపజేస్తున్నారని పవన్ విమర్శించారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. సారా వ్యాపారిగా మారారని ఎద్దేవా చేశారు. ఇసుక, మద్యం మాఫియాతో వైసీపీ నాయకులు దోచుకుతింటున్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీని ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.


పేదలను దోచేసి క్లాస్ వార్ అని మాట్లాడతాడు


జగన్ మాట్లాడితే క్లాస్ వార్ ... క్లాస్ వార్ అని మాట్లాడతాడు. క్లాస్ వార్ అంటే డబ్బున్న వాడు పేదవాడిని దోచేయడం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట పొట్టకొట్టింది పేదవాడినే. రూ.337 కోట్ల జాతీయ ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారు. కేవలం 6.22 కోట్లు మాత్రమే ఉపాధి హామీ పథకం కోసం ఖర్చు చేశారు. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎక్కువగా జరిగిన రాష్ట్రమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాధ్వీ నిరంజన్ గారు పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. పోలీసుల శ్రమ దోపిడీ చేసిన వ్యక్తి జగన్. టీఏ, డీఏలు ఇవ్వలేదు. సకాలంలో జీతాలు వేయడం లేదు. వారాంతపు సెలవు ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయాడు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ. 450 కోట్లు దారి మళ్లించి దోపిడీ చేశారు. 900 చేనేత సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.80 లక్షల నుంచి కోటి వరకు రావాల్సిన ఆప్కో నిధుల రాకుండా చేసిన వ్యక్తి జగన్. మత్స్యకారులకు ఉపాధి కల్పించలేకపోగా... వాళ్ల పొట్టకొట్టాలని జీవో నెంబర్ 217 తీసుకొచ్చాడు. ఇలాంటి వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు.


విద్యుత్ కొనుగోళ్లలో రూ. 27,500 కోట్లు దోచుకున్నారు


వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో కరెంటు బిల్లులను పదిసార్లు పైగా పెంచారు. రకరకాల ఛార్జీల పేరుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో యూనిట్ ధర రూ.5 ఉంటే ఇప్పుడు రూ.18కు పెరిగిపోయింది. చంద్రబాబు గారు 20 ఏళ్లకు చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేయడంతో ఈ దుస్థితి దాపురించింది. చంద్రబాబు గారు అధికారంలో ఉండగా ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. ఈ రోజు కరెంటు బిల్లులు చూస్తే జేబులకు చిల్లు పడేలా కనిపిస్తున్నాయి. కరెంటు కోనుగోళ్లలోనే దాదాపు రూ. 27,500 కోట్లు అవినీతి జరిగింది’’ అని అన్నారు.