T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌లో ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్‌!

Rohit Sharma And Virat Kohli : పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లీ ఓపెనర్లుగా బరిలోకి దిగే  అంశాన్ని అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని సమాచారం. 

Continues below advertisement

Rohit Sharma And Virat Kohli Will Open In T20 World Cup 2024 :  క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్‌ ఇప్పటికే వచ్చేసింది. జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌(Team India), పాకిస్థాన్‌(Pakistan) జట్లు ఉన్నాయి. ఇక అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. 

Continues below advertisement

ఈ  క్రమంలో భారత జట్టు కూడా టీ 20 ప్రపంచకప్‌నకు సిద్ధమవుతోంది. ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ కావడంతో  అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ... జట్టు ఎంపిక కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  టీ 20 ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఉంటాడని ఇప్పటికే ఓ స్పష్టత  రాగా ఇప్పుడు ఓపెనర్లు గా ఎవరెవరు దిగనున్నారు అనే ప్రశ్నకు జవాబులు వెతికే పనిలో పడ్డారు. దీంతో  ఇప్పుడు మరో వార్త వైరల్‌గా మారుతోంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లీ ఓపెనర్లుగా బరిలోకి దిగే  అంశాన్ని అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని సమాచారం. 

ఓపెనర్లుగా ఇద్దరే.. 

టీ 20 ప్రపంచకప్‌లో ఓపెనర్లుగా రోహిత్‌, విరాట్ కోహ్లీను బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న దానిపై సెలక్షన్‌ కమిటీ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. తాజాగా  రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్ సమావేశం అనంతరం ఈ వార్తలు  బయటికి వచ్చాయి. టీ20ల్లో ఓపెనింగ్ చేస్తున్న శుభ్‌మ‌న్ గిల్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఆడించాలని ఆగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ గెలుపోటమిలతో సంబంధం లేకుండా తమ శక్తి వంచన లేకుండా  పరుగుల వరద పారిస్తున్నారు.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఓపెనర్‌గా దిగుతున్న కోహ్లీ ఇప్పటికే ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో సహా 361 పరుగులు చేసి అద్భుతంగా రాణిస్తున్నాడు. మరోవైపు ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ సృష్టించిన విధ్వంసం, నెలకొల్పిన రికార్డులు అభిమానులకు సైతం తెలుసు. ఈ విషయాలన్నీ   పరిగణ లోకి తీసుకున్న సెలక్షన్‌ కమిటీ  వారిద్దరినీ ఓపెనర్లుగా బరిలోకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

రియాన్ పరాగ్‌కు ఛాన్స్.. 

ఐపీఎల్ 2024లో  అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్‌కు రానున్న  టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇచ్చే విషయంపై రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రియాగ్‌ ఈ ఐపీఎల్‌లో ఏడు మ్యాచుల్లో 318 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

హార్దిక్‌ డౌటే.. 

ఈ ఐపీఎల్‌లో కెప్టెన్‌గానే కాకుండా బౌలర్‌గా, బ్యాటర్‌గా అన్ని రకాలుగా  కూడా దారుణంగా విఫలమవుతున్న ముంబై కెప్టెన్ హార్దిక్‌ పాండ్యాకు టీ 20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కడం కష్టమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గాయంతో చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్న హార్దిక్‌.. ఐపీఎల్‌ 2024లో పునరాగమనం చేశాడు. కానీ ఇప్పటివరకు సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. 

Continues below advertisement
Sponsored Links by Taboola