Pawan Kalyan Latest News: తనకు కేటాయించిన పదవులను గౌరవంగా భావించి బాధ్యతగా పనిచేస్తానని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన ఇన్‌స్టా వేదికగా స్పందించారు. 


ఏపీ ఉపముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టడం గౌరవంగా భావిస్తానని, తనకు అప్పగించిన బాధ్యతలతో రాష్ట్ర ప్రజలందరికీ సుస్థిర భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన సామాజిక మాధ్యమ వేదికగా తొలిసారి తన భావాలను పంచుకున్నారు. ‘‘ఏపీ ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా,  పర్యావరణం, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం గౌరవంగా ఉంది. దీనితో నా బాధ్యత పెరిగింది. రాష్ట్రానికి అంకిత భావంతో, సమగ్రతతో సేవచేయడానికి కట్టుబడి ఉన్నా. సుసంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తు అందరికీ అందించడంలో నా వంతు పాత్ర పోషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఇన్‌స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేశారు. తొలిరోజు మాదిరే రెండోరోజు సైతం  పవన్ కల్యాణ్ తన శాఖలపై రివ్యూలు నిర్వహించారు. 


తొలిరోజు పది గంటల పాటు సమీక్ష


డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్‌ తన శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించిన విషయం తెలిసిందే. సుమారు 10 గంటలపాటు జరిగిన ఈ సమీక్షలో పవన్ తన శాఖల తీరు తెన్నుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.  పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆయా శాఖల పనితీరు, రాష్ట్రంలోని పరిస్థితుల గురించి పవన్ కు వివరించారు.


ప్రణాలికలతో రండి.. 


అనంతరం అధికారులతో పవన్ మాట్లాడుతూ ‘‘రెండు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలను సందర్శించిన నాకు వారి సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. ఏజన్సీ ప్రాంతాల్లో కూడా బాగా పర్యటించా. వారి సమస్యలపై మరింత అవగాహన తెచ్చుకొని వారికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించేందుకు ప్రయత్నిస్తా. అరకు లాంటి గిరిజన ప్రాంతాల్లో మహిళలు తాగునీటి కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో స్వయంగా చూశా. పథకాల అమల్లో రాజకీయం జోక్యానికి అవకాశం ఇవ్వను. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా 2028 లోపు ప్రతి ఇంటికీ కొళాయి నీరు ఇచ్చే విధంగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలి.  గిరిజన ప్రాంతాల్లో తాగునీటిని అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. అన్ని పంచాయతీలకు రోడ్డు కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలతో ముందుకు రండి’’ అని అధికారులకు సూచించారు.


సొంతవాళ్లయినా ఉపేక్షించను. 


తన మార్కు రాజకీయంతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించేందుకు ముందుకు  కదిలిన జనసేనాని అవకతవకలు జరిగితే అధికారులనే కాదు..  సొంత పార్టీ వాళ్లనైనా ఉపేక్షించేది లేదని తొలి సమీక్షలోనే స్పష్టం చేశారు.  ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణం ఎవరు? పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? స్థానిక సర్పంచ్‌లకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా? ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు ఎందుకు ఇవ్వట్లేదు? అని సమీక్షలో పవన్ అధికారులను ప్రశ్నించారు. పవన్ ప్రశ్నల వర్షానికి అధికారులు నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన సచివాలయంలో సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ని కలిసి పలు అంశాలపై చర్చించారు.


రెండోె రోజూ అదేతీరు


ఇక, వరుసగా రెండో రోజూ పవన్ సమీక్షలకే పూర్తి సమయం కేటాయించనున్నారు.  తన శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.  బాధ్యతలు తీసుకున్న అనంతరం పవన్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ తయారు చేసిన ఫైల్ పై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైల్ పై రెండో సంతకం చేసిన విషయం తెలిసందే.