Pawan Meet JP Nadda :  ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో అరగంట పాటు సమావేశం అయ్యారు. . పవన్ తో పాటు చర్చల్లో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.  బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ .. అధికారం సాధించే దిశగానే చర్చలు జరిపామని ప్రకటించారు. బీజేపీ, జనసేన లక్ష్యం వైసీపీని ఓడించడమన్నారు.  రెండు రోజుల పాటు జరిగిన చర్చల వల్ల రాబోయే రోజుల్లో మంచి ఫలిాలు వస్తాయన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్  జనసేన ఎజెండా అని అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలు చెబుతానని పవన్ చెప్పారు. వైసీపీ వ్యతిరేక  ఓటు చీలకూడదనేదే మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.  


నిన్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో పవన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఏపీ బీజేపీ ఇన్ఛార్జీ మురళీధరన్ తో నిన్న భేటీ అయిన పవన్... ఈ ఉదయం ఆయనను మరోసారి కలిశారు. కాసేపటి క్రితమే వీరి సమావేశం అయ్యారు. కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడి తెలుగువారిని ఆకట్టుకోవడానికి పవన్ ను కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయించే ఉద్దేశంతోనే పిలిపించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే జేపీ నడ్డాతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్.. కర్ణాటక ఎన్నికల ప్రచారం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పూర్తిగా ఏపీ రాజకీయాల గురించే మాట్లాడారు. 


మురళీధరన్ తో రెండుసార్లు సమావేశమైన పవన్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఏపీలో బీజేపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తున్నప్పటికీ ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడంలేదు. తెలుగుదేశం పార్టీకి చేరువవుతున్న జనసేనాని బీజేపీ కూడా పొత్తుకు కలిసిరావాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే  ఈ విషయంలో ఆలోచన ఏమిటన్నదానిపై క్లారిటీ లేదు. 


హోంమంత్రి అమిత్ ,షాతో కూడా  భేటీ జరుగుతుందన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు.  దీంతో మురళీధరన్, జేపీ నడ్డాలతో సమావేశాల తర్వాత తిరుగు పయనమయ్యారు.  అయితే ఇప్పటికీ బీజేపీ, జనసేన పొత్తులోనే ఉన్నాయి.  కానీ ఏపీలో మాత్రం కలిసి పని చేయడం లేదు.  రాష్ట్ర నాయకులతో తనకు గ్యాప్ ఉందని పవన్ కల్యాణ్  చెబుతున్నారు. వారు వైసీపీపై పోరాటం చేయడం లేదని పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే బీజేపీ నేతలు కూడా అడిగినప్పుడు కూడా జనసేన మద్దతు ప్రకటించలేదని.. పొత్తు ఉన్నా లేనట్లేనని ప్రకటించేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత  ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ ఇలాంటి ప్రకటనలు చేశారు. దీంతో  జనసేన, బీజేపీ మధ్య పొత్తు లేనట్లేనని అనుకుంటున్నారు.  కానీ ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.