పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్లు, పోలీసుల మధ్య లెక్కలేనన్ని ఛేజింగ్ సీన్లు, ఫైటింగ్ సీన్లు ఉంటాయి. సరిగ్గా అలాంటి సీనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగింది. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో పోలీసు వాహనాన్ని ఎర్ర చందనం స్మగ్లర్లకు చెందిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో డక్కిలి ఎస్సై నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


రాపూరు అటవీ ప్రాంతం నుంచి స్మగ్లర్లు కారులో ఎర్రచందనం తరలిస్తున్నట్లు స్థానిక ఎస్సైకు సమాచారం అందింది. డక్కిలి మీదుగా తిరుపతి హైవే వైపు ఆ కారు వెళ్తున్నట్లు తెలియడంతో డక్కిలి ఎస్సై నాగరాజుకు రాపూరు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో డక్కిలి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎస్సై నాగరాజు వాహనంలో వారిని ఛేజ్ చేసేందుకు బయలుదేరారు. స్మగ్లర్లను అడ్డగించారు. దీంతో స్మగ్లర్లు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ ఛేజింగ్ లో ఓచోట స్మగ్లర్ల వాహనం ఆగింది. అక్కడితో వారు ఆగిపోయారనుకున్నారు పోలీసులు. పోలీస్ జీప్ వేగంగా ముందుకెళ్లింది. ఆ తర్వాతే అసలు సీన్ మొదలైంది. స్మగ్లర్లు కారుతో పోలీస్ జీపుని ఢీకొట్టారు. ఎస్సై నాగరాజుకి గాయాలు కావడంతో స్మగ్లర్లు భయపడ్డారు. కారుని అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. కారులో ఎర్రచందనం దుంగలు లేవు. కానీ అందులో ఉన్నవారు స్మగ్లర్లే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసు జీపు పైకి రావడం, కారుతో ఢీకొట్టి పారిపోవడం చూస్తుంటే వారు కచ్చితంగా స్మగ్లర్లేనని అంటున్నారు. 


నెల్లూరులోనే ఎందుకు..?
ఎర్రచందనం చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో విరివిగా దొరికినా.. వాటిని నెల్లూరు జిల్లాలోని కొండకింద పల్లెల్లో నిల్వ చేస్తుంటారు. రాపూరు, డక్కిలి అటవీ ప్రాంతాల్లో కూడా ఎర్రచందనం డంప్ లు ఉంటాయని సమాచారం. దీంతో స్మగ్లర్ల కదలికలకు ఈ రెండు ప్రాంతాలు ఫేమస్ అయ్యాయి. ఎర్రచందనం రవాణాకోసం కూడా ఇదే మార్గాన్ని ఉపయోగిస్తుంటారు స్మగ్లర్లు. 


ఇటీవలకాలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో కొన్నాళ్లుగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో స్మగ్లర్ల కదలికలు దాదాపుగా ఆగిపోయాయి. కానీ ఇప్పుడు స్మగ్లర్లు కారులో వెళ్తున్నారనే సమాచారం పోలీసులకు రావడంతో రాపూరు ఎస్సై వాహనాల తనిఖీ చేపట్టారు. వారికి కారు దొరక్కపోవడంతో ఆయన డక్కిలి ఎస్సైకి సమాచారమిచ్చారు. వారు కారుని వెంబడించే క్రమంలో కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో డక్కిలి ఎస్సై గాయాలతో ఆస్పత్రిలో చేరారు. 


పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. ఎస్సైకి తీవ్ర గాయాలు కావడంతో స్మగ్లర్లను వెదికి పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే స్మగ్లర్లు కారు వదిలిపెట్టి పారిపోయారు. స్మగ్లర్లు అటవీ ప్రాంతంలోకి పారిపోతే వారిని పట్టుకోవడం కష్టం. కానీ పోలీసులు మాత్రం ప్రత్యేక టీమ్ లతో వారిని వెదుకుతున్నారు. 


ఘటన జరిగిన ప్రాంతం రెండు జిల్లాలకు సరిహద్దులో కావడంతో ఇటు నెల్లూరు, అటు తిరుపతి పోలీసులు ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. రెండు జిల్లాల్లో అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టారు. అనుమానాస్పద వ్యక్తులు ఎక్కడైనా తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.