తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజు వస్తే చాలు... వాళ్ళ పాత సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు సందర్భంగా 'ఆరెంజ్' రీ రిలీజ్ చేశారు. మంచి కలెక్షన్స్ వచ్చాయి. వసూళ్లను జనసేన పార్టీకి ఇచ్చారు. అది వేరే విషయం అనుకోండి! తెలుగు రాష్ట్రాల్లో సినిమాను రీ రిలీజ్ చేయడం కామన్! విదేశాల్లో రీ రిలీజ్ చేయడం నయా ట్రెండ్! దానికి రామ్ చరణ్ సినిమాతో శ్రీకారం చుడుతున్నారు.


జపాన్‌లో 'రంగస్థలం' రిలీజ్
ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan)ను అభిమానులు గ్లోబల్ స్టార్ అంటున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR Movie) విడుదల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలను చూడాలని కోరుకుంటున్నారు. దాంతో విదేశాల్లో మెగా పవర్ స్టార్ పాత సినిమాలకు క్రేజ్ ఏర్పడుతోంది. 


నటుడిగా రామ్ చరణ్ స్థాయిని పెంచిన సినిమా 'రంగస్థలం'. గోదావరి నేపథ్యంలో పల్లెటూరి వాతావరణంలో తీసిన ఆ సినిమాలో రామ్ చరణ్ కొత్తగా కనిపించారు. ఇప్పుడు ఆ సినిమాను జపాన్ (Rangasthalam Japan Release)లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో చొగో సిటీలో ఒక్కో షో వేస్తున్నారు. ఆ తర్వాత మెల్లగా షోలు పెంచే ఆలోచనలో ఉన్నారట. అక్కడ 'ఆర్ఆర్ఆర్' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. భారీ వసూళ్లు సాధించింది. 


'గేమ్ చేంజర్'తో చరణ్ బిజీ
'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ సోలో కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer Movie). శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాణీ కథానాయిక. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో చరణ్ హెయిర్ స్టైల్ కొత్తగా కనిపించింది. టైటిల్ మోషన్ పోస్టర్ అయితే సినిమాపై అంచనాలు పెంచింది. 


రాజకీయ నాయకులు, సివిల్ సర్వెంట్స్ (ఐఏఎస్ అధికారులు) నేపథ్యంలో 'గేమ్ చేంజర్' సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. గతంలో 'ఒకే ఒక్కడు', 'జెంటిల్ మన్', 'భారతీయుడు' వంటి సినిమాలు తీసిన ఘనత ఆయనది. సామజిక సందేశంతో సినిమా తీసిన ప్రతిసారీ శంకర్ సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. అందుకని, 'గేమ్ చేంజర్' మీద మంచి అంచనాలు ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆ స్థాయి విజయాన్ని రామ్ చరణ్ అందుకుంటారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.


Also Read : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండగ - ముందు రోజు ఫస్ట్ లుక్, బర్త్‌డేకి గ్లింప్స్!


శంకర్ సినిమాల్లో కథలతో పాటు సాంగ్స్ హైలైట్ అవుతాయి. 'గేమ్ చేంజర్' సాంగ్స్ కూడా సూపర్ ఉంటాయని టాక్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డ్యాన్స్ మాస్టర్లు ప్రభుదేవా, గణేష్ ఆచార్య, బోస్కో ఒక్కో పాటను కొరియోగ్రఫీ చేశారు.  


తర్వాత సినిమా ఎవరితో?
'గేమ్ చేంజర్' తర్వాత 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత కన్నడ దర్శకుడు నర్తన్, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలు లైనులో ఉన్నాయి. ప్రజెంట్ చరణ్ ఓకే చేసినవి అన్నీ పాన్ ఇండియా సినిమాలే. 


Also Read జీ చేతికి అనుష్క 'శెట్టి' సినిమా - డిజిటల్, శాటిలైట్ రెండూ!