జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో తానే సీఎం అభ్యర్థిని అని చెప్పుకొని జనాల్లోకి వెళ్లాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. లేదంటే యాత్రకు ప్రజలు ఎవరూ మద్దతు పలకవద్దని పిలుపు ఇచ్చారు. గత 27 ఏళ్లుగా బీసీలుగానీ, కాపులు గానీ ముఖ్యమంత్రులుగా లేరని గతంలో తాను చిరంజీవికి మద్దతు ఇచ్చానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాక ఆయన దానికి దూరంగా ఉన్నారని అన్నారు. 

పవన్ కల్యాణ్ తాను సీఎం అభ్యర్థిని కాదని, సీఎం జగన్ ను దింపడంతో పాటు, చంద్రబాబును సీఎం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని పవన్ కల్యాణ్ అంటున్నారని కేఏ పాల్ అన్నారు. అసలు మన రాష్ట్రానికి బీజేపీ, చంద్రబాబు అన్యాయం చేశారని అన్నారు. తెలంగాణకు కూడా బీజేపీ, కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శించారు. పవన్ కల్యాణ్ వీరి విషయంలో ఆచితూచి అడుగు వేయాలని, స్వార్థ రాజకీయాలకి స్వస్తి చెప్పాలని అన్నారు.

ఎన్టీఆర్‌ బతికుండానే చంద్రబాబు ఇబ్బందులకు గురి చేసి, నిత్య నరకం చూపించారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యూహాలు కనిపెట్టాలని అన్నారు. ఎన్టీఆర్ కు దగ్గరైన నాయకుల్లో ప్రముఖులైన బాలయోగి, లాల్ జన్ భాషా, ఎర్రన్నాయుడు తదితరులు ఇప్పుడు బతికి లేరని, అన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. కాబట్టి, పవన్ కల్యాణ్ కు ప్రాణ హాని కూడా ఉందని, రాజకీయం కోసం చంద్రబాబు ఏమైనా చేయడానికి తెగిస్తారని తీవ్ర వ్యాఖ్య చేశారు. సింపతీ కోసం ఇంకొకరితో చంపించేసి, అది జగన్ మీదకి తోసేసినా మోసపోవద్దని మాట్లాడారు. కొడుకు లోకేశ్ ను ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబు ఎంత దూరమైనా వెళ్తారని అన్నారు. 

‘‘పవన్ కల్యాణ్ తమ్ముడు రండి కలిసి పని చేద్దాం అంటే.. ప్రజాశాంతి పార్టీకి 60 శాతం ఓటు బ్యాంకు ఉంది, జనసేనకు ఉన్న ఒకటి రెండు శాతం ఓట్లు కలిస్తే కలిస్తే మంచి బీసీ నాయకుడ్ని లేదా చిరంజీవిని లేదా పవన్ కల్యాణ్ ను ఏపీలో ముఖ్యమంత్రిని చేస్తాను. ఎలాగూ తెలంగాణలో నేను సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను’’ అని కేఏ పాల్ అన్నారు.