Pawan In Delhi :   జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. వీరి మధ్య దాదాపుగా అరగంట సేపు చర్చలు జరిగాయి. రాష్ట్ర రాజకీయాలపైనే ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై చర్చించామని జేపీ నడ్డా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.  






ఏపీలో పొత్తుల చిక్కులపై నడ్డాతో చర్చలు


ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల మధ్యే పవన్, నడ్డా ఎక్కువగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, కేంద్రం వద్ద ఉన్న నివేదికలు, ఇతర అంశాలతో..తదుపరి ఏం చేయాలన్నదానిపై చర్చించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ , జనసేన కలిసి పని చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపైనా చర్చించినట్లుగా చెబుతున్నారు . గత రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. పవన్ కల్యాణ్ ఎలాంటి అధికారిక హోదాలో లేరు. బీజేపీ మిత్రపక్షంగా మాత్రమే కలుస్తున్నారు. అందుకే కేవలం రాజకీయ అంశాలే మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. 


వరుసగా కీలక సమావేశాల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్                                


ఎన్డీఏ మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్లిన పవన్.. సమావేశంలో ప్రధానమంత్రితోనూ మాట్లాడారు. ఆ తర్వాత  ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ తో పాటు... హోంమంత్రి అమిత్ షాతో కూడా చర్చించారు. దీంతో బీజేపీ అగ్రనేతలందరితో సమావేశమయ్యారు. తిరికి ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం తిరిగి రానున్నారు. సాయంత్రం..   జనసేన పార్టీలో చేరేందుకు పంచకర్ల రమేష్ బాబు విశాఖ నుంచి మంగళగిరి వస్తున్నారు. నాలుగు గంటలకు పంచకర్ల రమేష్ బాబు చేరిక ప్రోగ్రాం ఉంటుందని  ఇప్పటికే జనసేన నాయకులు ప్రకటించారు. ఇక ఢిల్లీలో ఎలాంటి సమావేశాలు లేనందున పవన్ కల్యాణ్ కూడా వెంటనే తిరుగు పయనమయినట్లుగా తెలుస్తోంది. 


కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతో పవన్                                    


వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ..  ఓట్లు చీలకుండా చూసుకోవాలని పవన్ కల్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ ఢిల్లీ పర్యటనలో ఎలాంటి ముందడుగు పడిందనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.