Pawan Kalyan :    వైసీపీ పాలనలో చెట్లు కూడా విలపిస్తున్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు.  కొట్టేసిన చెట్ల దృశ్యాలతో ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు.  ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు   ఈ విషయం కూడా తెలుసుకోవాలి...వృక్షో రక్షతి రక్షితః అని ట్వీట్ చేశారు.                                            



 

పవన్ కల్యాణ్ పెట్టిన ఫోటోలన్నీ  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనివి.   అమలాపురంలో ఈనెల 26న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను అధికారులు తొలగించడం వివాదాస్పదం అవుతోంది.  స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుంచి బాలయోగి ఘాట్ వరకు సీఎం రూట్ మ్యాప్  ప్రకారం రోడ్డు పక్కన ఉన్న చెట్లను  అధికారులు కొట్టేశారు.  ముఖ్యమంత్రి ఒక్కరోజు పర్యటన కోసం పర్యావరణాన్ని కాపాడే చెట్లను నరికి వేయడం దారుణం అంటూ విపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.       


అంతే కాకుండా సీఎం హెలికాప్టర్ దిగేందుకు  ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ వద్ద ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్లను నరికి హేలీప్యాడ్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. అవి ముఫ్ఫై ఏళ్ల వయసు ఉన్న చెట్లని.. వాటిని కొట్టేయాల్సిన అవసరం లేదని అమలాపురం ప్రజలు అంటున్నారు. అమలాపురంలోని ఎస్ కే బీ ఆర్ కళాశాల, కిమ్స్ మెడికల్ కళాశాలలో రెండు హెలీ ప్యాడ్ లు ఉన్నప్పటికీ అవి పరిగణలోకి తీసుకోకుండా రూ. 15 లక్షలు ప్రజాధనం వెచ్చించి.. పెద్ద ఎత్తున చెట్లను కొట్టి వేసి.. కొత్త హెలీప్యాడ్ నిర్మించారన్న విమర్శలు వస్తున్నాయి.                                                           


 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసానికి నిదర్శనం అని, మరోసారి అమలాపురంలో నిరూపితమవుతుందని చెట్లు నరికివేతపై  జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు విమర్శలు గుప్పించారు. అమలాపురం చెట్ల నరికి వేత వీడియోలను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ నేరుగా జగన్ పై ఇవే ఫోటోలతో మండిపడ్డారు.