Pawan Kalyan : రాజకీయాల్లో ప్రలోభాలను దాటుకుని వెళ్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. టీడీపీ పార్టీకి జనసేన బీ టీం అంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. బయట వాళ్లు అంటే పర్వాలేదు కానీ.. సొంత వాళ్లు కూడా అనుమానంగా చూస్తున్నారని సెటైర్ వేశారు. తాడేపల్లి గూడెంలో జనసేన నాయకులు వీర మహిళలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ..పలు అంశాలపై మాట్లాడారు.
రాజకీయాల్లో ఎదురుదాడి అలవాటు చేసుకోవాలని, మనం ఏ తప్పు చేయనప్పుడు భయపడే పని లేదని, అద్భుతాలు చేయాలని రాజకీయాల్లో రాలేదని, పేదల జీవితాలు మార్చాలని వచ్చానన్నారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాడానికే పోరాడుతున్నానని, తానూ, తన కుటుంబం ఎందుకు విమర్శలు ఎదుర్కొవాలని పవన్ ఎదురు ప్రశ్నించారు. సమాజంపై ప్రేమతో తన ప్రాణాన్ని కుటుంబానికి పణంగా పెట్టి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ దేనికి అని పవన్ ప్రశ్నించారు. సమాజంలో అవినీతి అనేది నిత్యకృత్యమైపోయిందని, తన అభిమాని అయినాసరే… మాన ప్రాణాలకు భంగం కలిగిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.
నన్ను అన్నా.. నా కుటుంబాన్ని అన్నా నాకు కోపం రాదు.. ప్రజలను అంటే మాత్రం నాకు కోపం వస్తుందన్నారు. జనసేన కార్యకర్తను ఒక మహిళా సీఐ చెంప చెళ్లుమనిపించడం చాలా బాధేసింది. జగన్ సోదరి పార్టీ పెట్టారు.. ఇప్పుడు కాంగ్రెస్ లో కలిపేస్తున్నారని అంటున్నారు. మీరు అలా చేస్తారా అని నన్ను అడిగారు. పార్టీని నడపడం చాలా కష్టం.. వేల కోట్లు ఉంటే చాలదు. సైద్ధాంతిక బలం, పోరాటపటిమ, రాజ్యాంగంపై అవగాహన ఉంటేనే పార్టీని నడపగలం. అత్యవసరంగా అధికారంలోకి రావాలని నేను అనుకోవడం లేదని స్పష్టం చేశారు.
అలా అనుకుంటే కాంగ్రెస్‌లోకి వెళ్లి ఏదో పదవి తెచ్చుకునే వాడిని. జగ్గుభాయ్‌ను ఇంటికి పంపే రోజు వచ్చింది. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో చూపిస్తా. కొందరు వాలంటీర్లు నా దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి, దగ్ధం చేస్తుంటే.. అటువంటి వాటిని అసలు పట్టించుకోను. వైఎస్సార్‌ను అందరూ దేవుడంటారు.. ఆయన దేవుడు అయితే అంతమంది ఐఏఎస్‌లు జైలుకు ఎందుకెళ్ళారు. ఆయన అవినీతి చెయ్యబట్టే కదా.. ప్రభుత్వం మారితే కొందరు వాలంటీర్లు ఆ విధంగానే ఇరుక్కుంటారు’’ అంటూ సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నా పెళ్లాన్ని అంటే పట్టించుకోను.. నా వివాహాలకు సంబంధించి విడాకులు తీసుకున్నా.. జగన్ మాత్రం నా పెళ్లిళ్లు పట్టుకుని అక్కడే ఉన్నాడంటూ మండిపడ్డారు. సమావేశంలో జగన్ ను జగ్గూభాయ్ అంటూ సంబోధించారు.