Coal Production: సింగరేణిలో బుధవారం రోజు రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా బొగ్గు గనుల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కొత్తగూడెం జిల్లాలోని ఉపరితల గనుల్లో ఉత్పత్తిని ఆపేశారు. భారీ వర్షం కారణంగా పని ప్రాంతంలో యంత్రాలపై పని చేయడం చాలా కష్టంగా మారింది. ఈక్రమంలోనే గనుల్లోని రోడ్లు బురదమయం అయ్యాయి. దీంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉభయ జిల్లాల్లోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి స్తంభించిపోయింది. కొత్తగూడెం ఏరియాలోని మూడు ఉపరితల గనుల్లో 15 వేల టన్నులు, మణుగూరు ఏరియాలోని రెండు ఉపరితల గనుల్లో 15 వేల టన్నులు, ఇల్లందు ఏరియాలోని మరో రెండు ఉపరితల గనుల్లో 7 వేల న్నుల మేరకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం నిరంతరంగా కురుస్తుండడంతో రెండో షిఫ్టులో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈరోజు రాత్రి వరకు వర్షం తగ్గితే శుక్రవారం ఉదయం నుంచి బొగ్గు ఉత్పత్తి పనులు యథావిధిగా ప్రారంభం అవుతాయని సింగరేణి అధికారులు తెలిపారు.  


రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు


నిన్నటి ఆవర్తనం ఈ రోజు నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు మరొక ఆవర్తనము ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీద, సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ ఎత్తు వద్ద ఏర్పడిందని తెలిపారు. ఈరోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, ఎల్లుండి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. 





హైదరాబాద్ లో ఇలా


‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 83 శాతంగా నమోదైంది.



వర్షాకాలంలో ముఖ్యంగా ఎడతెరిపి లేకుంగా వర్షాలు కురుస్తున్నా, ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పని చేసే కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వివరించారు.