Pawan Kalyan Comments on Tamil Politics: తమిళ రాజకీయాలపై జనసేన అధినేత చేసిన కామెంట్స్ మళ్లీ హాట్‌టాపిక్‌గా మారాయి. రాజమండ్రిలో పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన పవన్.. తమ పార్టీ నేతల తీరు.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల సంక్లిష్టత గురించి మాట్లాడారు. ఈ సందర్భంగానే ఆయన నవ్వుతూ తమిళనాడు రాజకీయాల గురించి కామెంట్ చేశారు. చూడటానికి అవి పాసింగ్ రిమార్క్స్‌గానే ఉన్నాయి కానీ.. ఆయన చేసిన కామెంట్లు పట్టించుకోదగ్గవే
తమిళ రాజకీయాలు నాకు అసూయ కలిగిస్తున్నాయి.
తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇక్కడ రాజకీయంగా ఎదగడంలో ఉన్న ఇబ్బందులను ప్రస్తావించిన పవన్.. తమిళనాడులో రాజకీయాలు చాలా సులువుగా.. స్ట్రైయిట్‌గా ఉన్నాయని అన్నారు. " తమిళనాడులో పాలిటిక్స్ ఎంత సుఖంగా చేశారో చూడండి... నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. కటౌట్లు పెట్టుకుని చక్కగా సీఎం అయిపోయారు. కానీ నన్ను 15 ఏళ్లు రోడ్లుపై దేకించినా కానీ.. ఇక్కడ ఏం కాలేదు" అంటూ నవ్వుతూ కామెంట్ చేశారు.
పవన్ కల్యాణ్ చాలా లైట్‌గా కామెంట్ చేసినట్లు కనిపించినా ఇవి కచ్చితంగా చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఇంతకు మందు కూడా విజయ్ గెలుపుపై ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు వేరని కామెంట్ చేశారు. దానికి తమిళనాడులో కొంత నెగటివిటీ వచ్చింది. మళ్లీ పవన్ అదే ధోరణిలో మాట్లాడారు. సీఎం కావాలనో.. రాజకీయంగా ఎదగాలనో.. తాను రాజకీయాల్లోకి రాలేదని చెబుతూనే .. అక్కడ ఫ్యాన్స్ ఓటేస్తేనే విజయ్ సీఎం అయిపోయారన్నట్లుగా మాట్లాడారు. తన దగ్గరకు వచ్చేసరికే.. ఫ్యాన్స్ కులాలవారీగా.. పార్టీల వారీగా.. ప్రాంతాల వారీగా విడిపోయారన్నారు. తనపై అభిమానాన్ని సినిమాల వరకే చూపించారని... పార్టీని సపోర్టు చేయలేదన్న నిష్టూరం ఆయన మాటల్లో కనిపించింది.
సొంత పార్టీ కార్యకర్తలకు క్లాస్
ఒక్కరోజులోనే అంతా అయిపోవాలన్న ఆరాటం కార్యకర్తల్లో ఉందని.. కానీ ఏపీ రాజకీయాలు అలా లేవని చెప్పారు. 12 ఏళ్ల రాజకీయ పోరాటంలో ఎంతో సహనాన్ని అలవర్చుకున్నా అని చెప్పారు. అందరూ చేసినట్లుగా అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేయడం తన ఉద్దేశ్యం కాదన్నారు. రాజకీయంగా ఓడినా.. గెలిచినా.. తాను మాత్రం ముందుకే వెళ్లాను కానీ.. వెనుకబడలేదని పవన్ కల్యాణ్ అన్నారు. "మనకు అనుకూలంగా మాట్లాడటానికి కనీసం సొంతంగా టీవీ ఛానళ్లు ఉన్నాయా? ఆఖరికి మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అయినా నాకు ఏదైనా కష్టం వస్తే ఒకే తాటిపై, ఏకాభిప్రాయంతో నిలబడుతున్నాయా?" అంటూ పార్టీ అంతర్గత లోపాలను సున్నితంగా వేలెత్తి చూపారు. కేవలం సినిమా క్రేజ్, కటౌట్లు చూసి ఓట్లేసే సంస్కృతి కంటే ఏపీలో కుల సమీకరణాలు, పక్కా వ్యూహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయని, అందుకే తాను ఎన్నో అవమానాలు భరించి, పొత్తుల ఫార్ములాతో నిలబడాల్సి వచ్చిందని వివరించారు.
