Pawan Kalyan Serious Warning:
వ్యక్తిగత ఎదుగుదల కోసం తనను పంచింగ్ బ్యాగ్‌లా వాడుకోవడం మానేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శకులకు.. విశ్లేషకులను హెచ్చరించారు. తన సహనాన్ని పరీక్షించొద్దన్నారు. సోమవారం రాజమండ్రిలో పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ చాలా తీవ్ర స్థాయిలో రియాక్టయ్యారు. ముఖ్యంగా రాజకీయ విశ్లేషణల పేరుతో క్యారెక్టర్ ను కించ పరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు . రాజకీయాల్లో తనను పంచింగ్ బ్యాగ్ లా వాడుకోవడం ఇకపై సాధ్యం కాదని, సహనానికీ ఒక హద్దు ఉంటుందని గత పుష్కర కాలంగా తాను ఎన్నో అవమానాలను, వ్యక్తిగత విమర్శలను భరిస్తూ వచ్చానని, కానీ తన మౌనాన్ని బలహీనతగా భావిస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "భరిస్తాం, సహిస్తాం.. హద్దులు దాటితే తాట తీస్తాం" అంటూ ఆయన ఇచ్చిన హెచ్చరించారు.
ప్రొ. నాగేశ్వర్‌పై పరోక్ష కామెంట్స్
ఇటీవల పవన్ కల్యాణ్ గురించి రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. వైసీపీ అధినేత జగన్‌ను అరెస్ట్ చేయాలని పవన్ కల్యాణ్ అడిగితే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిరాకరించారని ఆయన చేసిన కామెంట్లపై జనసేన నేతలు తీవ్రంగా రియాక్టయ్యారు. ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. దానిపై పవన్ కల్యాణ్ ఇవాళ రియాక్ట్ అయ్యారు. ప్రొఫెసర్ పేరెత్తకుండానే ఇాలాంటివి తాను సహించలేనన్నారు. అమిత్‌షాతో నేను మాట్లాడినప్పుడు.. ఆయన పక్కన ఉన్నారా..? ఆయనంటే గౌరవం ఉంది.. కానీ దారినపోయే వాళ్లు చేసినట్లుగా.. ఓ స్థాయిలో ఉన్న వాళ్లు ఇలాంటి కామెంట్లు చేయకూడదు.. " అన్నారు.
వ్యక్తిత్వ హననంపై ఆగ్రహం
రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ ఒక పథకం ప్రకారం తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించబోనని పవన్ హెచ్చరించారు. "నాకు కులం, ప్రాంతం అంటగడుతున్నారు. కానీ నేను తిరిగి సమాధానం ఇస్తే మాత్రం మీకు కులం గుర్తొస్తుందా? మేధావులమని చెప్పుకునే వారు తమ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే మేము చేతులు కట్టుకుని కూర్చోవాలా?" అని ఆయన ప్రశ్నించారు. సామాన్య మనుషుల్లాగే తమకూ ఆవేశం, కడుపు మంట ఉంటాయని, ఇకపై ప్రతి విమర్శకు అదే స్థాయిలో కౌంటర్లు ఉంటాయని స్పష్టం చేశారు. నేను అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి? ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 'నేను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. శత్రువు బలంగా ఉన్నప్పుడే ఎదుర్కొంటా.. బలహీనులను కాదు' అని వ్యాఖ్యానించారు.
జగన్ జైలు కోసం నేను అడుగుతానా..? నా తెగింపు తెలీదా..?
జగన్‌ను జైలులోకి పంపించమని తాను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను అడిగానని చెప్పడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జగన్ ను జైలుకు పంపమని అడగాల్సిన అవసరం తనకేంటన్నారు. ఒకవేళ ఆయన జైలుకు వెళితే తన పార్టీకి ఏమైనా లాభమా అని ప్రశ్నించారు. డర్టీ పాలిటిక్స్ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని.జగన్ కంటే ముందే తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడే తుపాకి సరెండర్ చేసి రాజకీయాల్లోకి వచ్చానని అంతటి తెగింపు ఉన్న తాను జగన్‌పై కంప్లెయింట్ చేస్తానా ..? అని ప్రశ్నించారు. అయినా ప్రధాని, హోం మంత్రిలను కలిసినప్పుడు దేశ భవిష్యత్, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలు మాట్లాడతాం కానీ... జగన్ గురించి ఎందుకు చెబుతామన్నారు. అయినా జగన్‌ను ఏం చేయాలో వ్యవస్థలకు తెలుసన్నారు.
పార్టీ నేతలకు హెచ్చరిక
గీతదాటుతున్న పార్టీ నేతలకు పవన్ హెచ్చరికలు జారీ చేశారు. తనకు నచ్చినట్లుగా పార్టీని నడుపుతానని ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పదవులు వచ్చిన తర్వాత చాలా మంది జనసేన నాయకులు మెత్తబడిపోయారని, అలాంటి నాయకులు జనసేనకు అవసరం లేదని స్పష్టం చేశారు. మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు. శత్రువులు బయట ఎక్కడో లేరు.. మన పార్టీలోనే ఉన్నారు అంటూ పార్టీ నేతలకు పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనలో ఉండగలిగేవాళ్లు మాత్రమే పార్టీలో ఉండండి అని స్పష్టం చేశారు. నేను టీడీపీ కోసం కాదు.. రాష్ట్రం కోసం సర్దుకుపోతున్నా అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇకపై జనసేన కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని, వ్యక్తిగతంగా విమర్శిస్తే అదే స్థాయిలో బదులిస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
తమిళనాడు రాజకీయాలను చూసి జెలసీ కలిగింది..!
జనసేనాని పవన్ కళ్యాణ్ పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజకీయాలపై, అక్కడ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధించిన తాజా విజయాలపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనను, విజయ్‌ను పోలుస్తూ వస్తున్న కామెంట్లపై స్పందించిన ఆయన.. తమిళ పాలిటిక్స్‌ను చూస్తే తనకు కొంత అసూయ కలిగిందని మనసులో మాటను బయటపెట్టారు. "అక్కడ రాజకీయాలు ఎంత సుఖంగా సాగాయో చూశాను.. తమిళనాడులో విజయ్ అభిమానులంతా విభేదాలు లేకుండా ఏకతాటిపై నిలబడ్డారు, ఎంచక్కా కటౌట్లు పెట్టుకున్నారు, ప్రచారం చేశారు, ఒకేసారి సీఎంను చేసేశారు. కానీ ఆంధ్రాలో నా పరిస్థితి అలా కాదు. నన్ను దాదాపు 15 సంవత్సరాల పాటు రోడ్డు మీద దేకిచ్చారు అంటూ పవన్ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పడ్డ కష్టాలను, ఆవేదనను గుర్తుచేసుకున్నారు. "మనకు అనుకూలంగా మాట్లాడటానికి కనీసం సొంతంగా టీవీ ఛానళ్లు ఉన్నాయా? ఆఖరికి మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అయినా నాకు ఏదైనా కష్టం వస్తే ఒకే తాటిపై, ఏకాభిప్రాయంతో నిలబడుతున్నాయా?" అంటూ పార్టీ అంతర్గత లోపాలను సున్నితంగా వేలెత్తి చూపారు. కేవలం సినిమా క్రేజ్, కటౌట్లు చూసి ఓట్లేసే సంస్కృతి కంటే ఏపీలో కుల సమీకరణాలు, పక్కా వ్యూహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయని, అందుకే తాను ఎన్నో అవమానాలు భరించి, పొత్తుల ఫార్ములాతో నిలబడాల్సి వచ్చిందని వివరించారు.
