Pawan Comments : పెడనలో జరగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు వైఎస్ఆర్‌సీపీ గూండాలు, రౌడీలతో ప్రయత్నిస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాళ్ల దాడులు చేసి రక్తపాతం సృష్టించాలని అనుకుంటున్నారని మచిలీపట్నంలో ఆరోపించారు. ఈ అంశంపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని.. వైసీపీ వాళ్లు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని పార్టీ శ్రేణులను కోరారు. వారాహి యాత్రపైకి రాళ్లతో ఎవరైనా దాడులకు వస్తే వారిపై దాడి చేయవద్దని పట్టుకుని పోలీసులకు అప్పగించాలన్నారు.
రెండు, మూడు వేల మందితో దాడి చేసే ప్రయత్నం
పెడనలో రెండు, మూడు వేల మంది రౌడీముకలు రాళ్ల దాడుల కోసం వచ్చే అవకాశం ఉందన్నారు. పెడనలో జరిగే పరిణామాలకు ప్రభుత్వం, డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తే ఊరుకోమని ఈ అంశంపైతమకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. జగన్ రెడ్డి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే భవిష్యత్‌లో దారుణమైన పరిస్థితులు ఉంటాయని గుర్తుంచుకోవాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
జోగి రమేష్ వ్యవహారశైలిపై అనుమానాలు
వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అవనిగడ్డలో బహిరంగసభ తర్వాత రెండు రోజుల పాటు మచిలీపట్నం కేంద్రం జనవాణి కార్యక్రమంతో పాటు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. బుధవారం పెడన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా జోగి రమేష్ ఉన్నారు. జోగి రమేష్ గతంలో తన అనుచరులందర్నీ తీసుకుని నేరుగా చంద్రబాబు ఇంటిపైకే దాడికి వెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాతే ఆయనకు మంత్రి పదవి లభించింది. పవన్ కల్యాణ్‌పై దురుసుగా మాట్లాడేవారిలో జోగి రమేష్ కూడా ఒకరు.
విపక్షాలపై దాడులు చేసి వారిపైనే కేసులు పెడుతున్నారని ఇతర పార్టీల నేతల ఆరోపణలు
ఇటీవలి కాలంలో విపక్ష నేతల పర్యటనల్లో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. వైసీపీ నేతలు ఎదురుగా వచ్చి దాడులు చేసినా అసలు వారిపై కేసులు పెట్టడం లేదని.. బాధితులైన విపక్షాల నేతలపైనే కేసులు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనలో చంద్రబాబుపై రాళ్ల దాడులు చేసినా... ఆయనపైనే హత్యాయత్నం కేసులు పెట్టారని.. తీవ్ర ఉద్రిక్తతలు సృష్టించేలా పోలీసులు వ్యవహరించి.. మొత్తం కేసులన్నీ చంద్రబాబుతో పాటు టీడీపీ నతేలపై పెట్టారని వందల మందిని ్రెస్టు చేశారని గుర్తు చేసుకుంటున్నారు.
భవిష్యత్ ఘోరంగా ఉంటుందని వైసీపీకి పవన్ హెచ్చరిక
అదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర భీమవరంలో జరుగుతున్నప్పుడు ప్రీ ప్లాన్డ్ గా యాత్రలపై రాళ్లు, సీసాలతో దాడులు చేసినా పోలీసులు సహకరించారని.. కానీ తిరిగి పాదయాత్రలో పాల్గొంటున్న వారిపై కేసులు పెట్టారని అంటున్నారు. ఇలాంటి కుట్రలే పెడనలోనూ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని పవన్ కల్యాణ్‌కు సమాచారం ఉందని అందుకే ఆయన ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారని చెబుతున్నారు.