పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని బలిజిపేట మండలం వెంగాపురం గ్రామంలో నాలుగు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలన్నీ నాశనం చేశాయి. విజయనగరం జిల్లా రాజాం మండలంలో ఉన్న ఈ ఏనుగురు అర్ధరాత్రి 25 కిలోమీట్లర మేర ప్రయాణం చేసి వెంగాపురం గ్రామ సమీపంలోని పంటపొలాలపై పడి పరుగులు పెట్టాయి. తొక్కి తొక్కి నాశనం చేశాయి. ఏనుగుర అరుపులతో విషయం గుర్తించిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చేతికి వచ్చిన పంటను నాశనం చేయడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికే భారీగా కురిసిన వర్షాల వల్ల పంట నాశనం కాగా.. ఇప్పుడు ఏనుగుల వల్ల పూర్తిగా నాశనం అయిందని వాపోతున్నారు. ఏనుగుల నుండి తమని, తమ పంటల్ని రక్షించాలని కోరుతున్నారు.
నాలుగు నెలల క్రితం తిరుమల ఘాట్ రోడ్డులో..
తిరుమల కొండపై ఏనుగుల సంచారం భక్తులను కలవరపెడుతుంది. కొన్ని రోజులుగా తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు సంచరిస్తుండడంతో భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఆదివారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని ఎలిఫాంట్ ఆర్చ్ వద్ద 11 పెద్ద ఏనుగులు, మూడు చిన్న ఏనుగుల గుంపును చూసిన వాహనదారులు భయంతో వాహనాలను నిలిపివేసి అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోనికి తరిమే ప్రయత్నం చేస్తున్నారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఒంటరి ఏనుగు హల్ చల్
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఒంటరి ఏనుగు గురువారం కలకలం రేపింది. గురువారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డుకు అనుకోని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు ఒక్కసారిగా ఘాట్ రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. ఒంటరి ఏనుగు ఘీంకారాలకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఎలిఫెంట్ ఆర్చ్ కు సమీపంలో ఒంటరి ఏనుగు చూసిన వాహన చోదకులు వాహనాలు నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజిలెన్స్ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వెంటనే అక్కడ చేరుకున్న అటవీ శాఖ అధికారులు భారీగా సైరన్ మోగించి ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. తరచూ అదే ప్రాంతంలో ఏనుగులు సంచరించడం గమనార్హం.
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడద
చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం అధికమవుతోంది. ఏనుగుల పంట పొలాలు ధ్వంసం చేస్తుండడంతో ప్రజలు విస్తుపోతున్నారు. గత కొంత కాలంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు గ్రామాలపైకి వస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. చిత్తూరు జిల్లా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండడంతో ఏనుగులు గుంపులు తరచూ అటవీ సమీప గ్రామాల్లోకి వచ్చి పంట పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా, రైతులపై దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. ఇటీవల సదుం మండలం గొల్లపల్లికి చెందిన యల్లప్ప రాత్రి సమయంలో పొలం వద్ద కాపలా ఉండగా ఒక్కసారిగా ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో యల్లప్ప మృతి చెందాడు.