Parents Protest On Doctors Negligence With Flexis In Srikakulam: వైద్యుల నిర్లక్ష్యం ఆ తల్లికి గుండెకోత మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కొడుకు ఇక లేడని ఆ మాతృ హృదయం జీర్ణించుకోలేకపోయింది. ఈ లోకంలో తానూ బతకలేనని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యుల అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడింది. అయితే, తమ కడుపుకోతకు కారణం వైద్యుల నిర్లక్ష్యమే అంటూ ఆ తల్లిదండ్రులు వినూత్న రీతిలో ఫ్లెక్సీల రూపంలో నిరసన తెలిపారు. శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. 


అసలేం జరిగిందంటే.?


శ్రీకాకుళం జిల్లా టెక్కలి (Tekkali) మండలం రానివలన పంచాయతీ చిన్ననారాయణపురానికి చెందిన దాసరి మురళి, నిరోషా దంపతుల కుమారుడు సాయివినీత్(12). మే 21న తోటి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతుండగా.. బాల్ పొదల్లో పడింది. దాన్ని తీసుకు వచ్చేందుకు వెళ్లిన సాయి వినీత్‌కు ఏదో కరవడంతో కాసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే బాలుడ్ని కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది బాలుడికి ముల్లు గుచ్చి ఉంటుందేమోనని భావించి. సుమారు 2 గంటలు నిర్లక్ష్యం చేసి తూతూమంత్రంగా వైద్య సేవలందించారు. చివరికి బాలుడి పరిస్థితి విషమించడంతో చేతులెత్తేసి.. శ్రీకాకుళంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్)కి రిఫర్ చేశారు.


పరిస్థితి విషమం


సాయివినీత్‌ను అంబులెన్స్‌లో నరసన్నపేట తీసుకువచ్చే సరికి బాలుడి పరిస్థితి మరింత విషమించింది. అక్కడ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా సాయివినీత్ పాముకాటుతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఒక్కగానొక్క కుమారుడు కళ్లెదుటే మృతి చెందడంతో ఆ మాతృ హృదయం తట్టుకోలేకపోయింది. మే 22న ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు ఆమెను అస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది.


ఫ్లెక్సీలతో నిరసన


కుమారుడి మృతితో కుంగిపోయిన ఆ దంపతులు ప్రతీ క్షణం కన్నీళ్లతో నివాళి అర్పించారు. తమకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక వైద్యుల నిర్లక్ష్యంపై నిరసన తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 'తల్లికి కడుపుకోత' అంటూ పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. 'మాకు కడుపుకోత మిగిల్చిన మీకు శ్రద్ధాంజలి. పాముకాటుకు, ముళ్లు గుచ్చుకోవడా వికి తేడా తెలియని వారికి శతకోటి వందనాలు' అంటూ వైద్యుల నిర్లక్ష్యం తీరును ఎండగట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే రిఫరల్ ఆస్పత్రిగా పేరొందిన జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యులు తీరు మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెరుగైన వైద్యసేవలందించేలా చర్యలు చేపట్టాలని పలువురు వేడుకుంటున్నారు.


Also Read: Vijayawada News: విజయవాడలో ప్రబలిన అతిసార - 9కి చేరిన మృతుల సంఖ్య, కలుషిత నీరే కారణమా?