Diarrhea Rampant In Vijayawada: విజయవాడ (Vijayawada) నగరంలోని కొన్ని ప్రాంతాల్లో డయేరియా (Diarrhea) ప్రబలుతోంది. మొగల్రాజపురం, పాయకాపురం ప్రాంతాల్లో అతిసార లక్షణాలతో ఇప్పటివరకూ 8 మంది మృతి చెందారు. తాజాగా, మొగల్రాజపురంలో గల్లా కోటేశ్వరరావు అనే వృద్ధుడు వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. గత 5 రోజులుగా డయేరియా లక్షణాలతో 9 మంది మృతి చెందగా.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో అతిసార లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. మొగల్రాజపురంలోనే ఆరుగురు విరేచనాలతో మృతి చెందగా.. పాయకాపురం, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు, ఓ బాలుడు మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక్క పాయకాపురం, మొగల్రాజపురం ప్రాంతాల్లోనే దాదాపు 50 మంది అతిసార బాధితులున్నట్లు తెలుస్తోంది. అయితే, పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా వైద్యారోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరాలు పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. మొగల్రాజపురంలోని సీపీఎం కార్యాలయంలో పడకలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు, డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టిన అధికారులు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. దాదాపు 250 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకూ ఒక్క దాని ఫలితమూ వెల్లడించలేదని.. త్వరగా వాటి వివరాలు అందించాలని బాధితులు కోరుతున్నారు.
కలుషిత నీరే కారణమా.?
కలుషిత నీరు తాగడం వల్లే అతిసార బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. తాగునీటి సరఫరాలో కలుషిత నీరు కలవడం వల్లే డయేరియా ప్రబలిందని స్థానిక ప్రజలు అంటున్నారు. నగరంలోని చిట్టినగర్, మొగల్రాజపురం, ఆటోనగర్, కృష్ణలంక ఇతర ప్రాంతాల్లో కుళాయి నుంచి పచ్చ రంగులో నీళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. అయితే, విజయవాడ మున్సిపాలిటీ అధికారులు మాత్రం అత్యంత సురక్షిత నీటినే సరఫరా చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. అతిసారతో ఎవరూ చనిపోలేదని.. మృతులకు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అతిసార లక్షణాలతో జనం ఆస్పత్రుల పాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సహాయం అందించి వ్యాధి ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: AP Election Counting Updates: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఈసీ మరో కీలక నిర్ణయం, రేపే ముహూర్తం!