Sarpanch Movement: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు సర్పంచులు సిద్ధమయ్యారు. తమకు రావాల్సిన నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు చేస్తున్న సర్పంచులు ఆ నిధులు తిరిగి పంచాయతీలకు ఖర్చు పెట్టే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. 8 వేల 660 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను తిరిగి పంచాయతీల ఖాతాలకు జమ చేసే దాకా పోరాటం చేస్తామని వెల్లడించారు. తిరుపతి నుంచి దేశ రాజధాని దిల్లీ వరకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ సమావేశంలో సర్పంచులు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో జరిగిన పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ సమావేశంలో 2 రోజుల్లో 12 తీర్మానాలను సర్పంచులు ఆమోదించారు.
ఫిబ్రవరిలో ఛలో దిల్లీ..
దారి మళ్లించిన నిధులను తిరిగి పంచాయతీలకు ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చాలని తిరుమల శ్రీవారిని కోరుతూ ఈ నెల ఆఖరులో తిరుపతి నుంచి తిరుమల కొండపైకి కాలి నడకన వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు వచ్చే నెలలో అన్ని రాజకీయ పార్టీలతో, సంఘాలతో విజయవాడలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఈ మేరకు సర్పంచులు ప్రకటన విడుదల చేశారు.
జగన్, బాబు, పవన్ సహా మిగతా నేతలకూ ఆహ్వానం
ఈ అఖిల పక్ష సమావేశానికి సీఎం వైఎస్ జగన్ ను కూడా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా ఇతర పార్టీల నాయకులు అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించాలని ఛాంబర్ కమిటీ సమావేశంలో సర్పంచులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి నుండి ప్రారంభించాలని తలపించిన ఛలో దిల్లీ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు కార్యాచరణ సిద్దం చేసుకున్నారు. దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సమస్యలను తీసుకు వెళ్లాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా విశాఖ జిల్లా గంభీరం గ్రామ సర్పంచి వానపల్లి లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆమెకు వైబీబీ రాజేంద్ర ప్రసాద్ నియామక పత్రాన్ని అందించారు. ఉపాధి హామీ పథకం పనులను, నిధులను మళ్లీ గ్రామ పంచాయతీల ఆధీనంలోకి తీసుకు రావాలని సర్పంచ్ లు తీర్మానం చేశారు.
పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ తీర్మానాలు:
1. మైనర్ పంచాయతీలకు తాగు నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయాలి.
2. గ్రామ సచివాలయాలతో పాటు వాలంటీర్లను పంచాయతీల పరిధిలో చేర్చాలి.
3. సిబ్బంది విధులు, నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై పర్యవేక్షణాధికారాల్ని సర్పంచులకు అప్పగించాలి.
4. సర్పంచ్, ఎంపీటీసీలకు 15 వేల రూపాయలు గౌరవ వేతనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంపీపీ, జడ్పీటీసీలకు 30 వేల రూపాయలు, జడ్పీ ఛైర్మన్ లకు 2 లక్షల రూపాయల గౌరవ వేతనం అందించాలి.