AP Govt Vs Tollywood :     ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , సినిమా ధియేటర్ యజమానుల మధ్య ఆన్ లైన్ టిక్కెట్ల వివాదం మరోసారి రాజుకుంది. అన్ని థియేటర్లు ఏపీఎఫ్‌సీడీ గేట్ వే ద్వారానే సినిమా టికెట్ల విక్రయాలు చేపట్టాలని  జూన్ 2న ఏపీ సర్కారు జీవో 69ను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు నెల రోజుల్లో థియేటర్లు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాలని ఆదేశించింది. 


ఒప్పందాలు చేసుకోవడానికి ధియేటర్ యాజమాన్యాల వెనుకడుగు


టికెట్ల విక్రయించిన తర్వాత థియేటర్లకు డబ్బు ఎన్ని రోజుల్లో జమ చేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ విషయంలో ఎగ్జిబిటర్లు అభ్యంతరం తెలిపారు. ఎంవోయూపై సంతకం పెడితే ప్రభుత్వ చేతుల్లోకి వెళ్లినట్లే అని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు.  అందుకే ఒప్పందంపై సంతకాలు చేయడానికి ససేమిరా అంటున్నారు. అవసరమైతే థియేటర్లను మూసివేసేందుకు కూడా వెనుకాడేది లేదని.. ఎంఓయూలో డబ్బులు తిరిగి థియేటర్లకు ఎప్పుడు చెల్లిస్తామనే అంశాన్ని పేర్కొనకపోతే సంతకాలు చేయబోమని థియేటర్ల యాజమానులు చెబుతున్నారు.  జులై 2 లోపు ఎంవోయూ లపై సంతకం చేయకపోతే లైసెన్స్ లు రద్దు చేస్తామని అధికారులు  హెచ్చరిస్తున్నారు. 


ఎగ్జిబిటర్లదంతా అపోహేనంటున్న ప్రభుత్వం - మరుసటి రోజే చెల్లింపులు 


అయితే ప్రభుత్వం మాత్రం ఎగ్జిబిటర్లదంతా అపోహ మాత్రమేననని.. ‘సినిమా టికెట్ల కలెక్షన్లు ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలో జమవుతాయి. రోజువారి ప్రాతిపదికన టికెట్ల కలెక్షన్లు థియేటర్లకు చెల్లిస్తారు’.. ఇదీ ఏపీ స్టేట్‌ ఫిల్మ్, టీవీ, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌  సినిమా థియేటర్ల యజమానులతో కుదర్చుకునే ఎంఓయూ లో స్పష్టంగా  ఉందని చెబుతోంది.   సినిమా టికెట్ల కలెక్షన్లలో సర్వీస్‌ చార్జి 1.95శాతం  మినహాయించుకుని మిగిలిన మొత్తం అంటే జీఎస్టీతో సహా థియేటర్ల బ్యాంకు ఖాతాలో ఒక్క రోజులోనే జమవుతుంది. థియేటర్ల యాజమాన్యమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒకరోజు కలెక్షన్‌ ఆ మర్నాడే థియేటర్ల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అవుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది.   


ఎగ్జిబిటర్ల మరికొన్ని ఆందోళనలపైనా ప్రభుత్వం క్లారిటీ !


ఎపీఎఫ్‌డీసీ ద్వారా నిర్వహించి ఆన్ లైన్ టిక్కెట్ ‌ వెబ్‌సైట్‌ లాగిన్‌ సౌకర్యం థియేటర్‌ కౌంటర్‌ వద్ద, మేనేజర్‌ చాంబర్‌లోనూ కల్పిస్తారని దీని వల్ల కౌంటర్ దగ్గర కూడా టిక్కెట్లు అమ్ముకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.  థియేటర్లకు బీఫాం లైసెన్సులు రెన్యువల్‌ కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే సులభంగా చేస్తారని ..  సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ విధానంలో ముందుగా రిజర్వ్‌ చేసుకునే సౌలభ్యం కల్పిస్తారని ప్రభుత్వం హామీ ఇచ్చారు. అడ్వాన్స్‌ టికెట్ల బుకింగ్‌ మొత్తం కూడా సంబంధిత షో ముగిసిన తరువాతే థియేటర్ల బ్యాంకు ఖాతాకు బదిలీచేస్తారని ప్రభుత్వం హామీ ఇస్తోంది..
 
జూలై మొదటివారంలో ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం విధానాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈలోగా ఎంవోయూల ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్లను ప్రభుత్వం నిర్దేశించింది. అందుకు విరుద్ధంగా వ్యవహరించే థియేటర్ల లైసెన్సులు రద్దు చేస్తారు.