Minister Jogi Ramesh : ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ కు పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయనకు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఒంగోలు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి జోగి రమేష్ కాన్వాయ్ లో రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంత్రి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఆయనకు ఏంకాకపోవడంతో మరోకారులో వెళ్లిపోయారు. 


డివైడర్ ను ఢీకొట్టిన మంత్రి కారు


మంత్రి జోగి రమేష్ సోమవారం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనకు వెళ్తున్న సమయంలో మంత్రి కాన్వాయ్ లో పలు కార్లు ఉన్నాయి. ఈ కార్లు జాతీయ రహదారిపై ఒకదానితో మరొకటి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. కాన్వాయ్ లో ముందు వెళ్తు్న్న వెళ్తున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ కొట్టడంతో వెనుక ఉన్న కార్లు ఒక్కసారిగా ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్ మధ్యలో ఉన్న మంత్రి జోగి రమేష్ కారు కూడా ఒక్కసారిగా బ్రేక్ వేయబోయి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న జోగి రమేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


మరో వాహనంలో పర్యటనకు


మంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురికావడంతో కాసేపు ఇబ్బంది పడ్డ ఆయన తర్వాత మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు ఇంటర్నల్ దర్యాప్తు చేస్తున్నారు. కాన్వాయ్ లో కార్లు ఢీకొనడానికి దారితీసిన కారణాలపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలోనూ పలువురు మంత్రుల కాన్వాయ్ లో కార్లు ఢీకొన్న ఘటనలు ఉన్నాయి.  కారు డ్రైవర్ల అలసత్వంతో పాటు సుదీర్ఘ ప్రయాణాలు ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుస్తోంది.


మంత్రి అనుచరులు హల్ చల్! 


మంత్రి జోగి రమేష్ అనుచరలమంటూ కొందరు వ్యక్తులు విజయవాడలో హల్ చల్ చేశారు. భవానిపురంలోని పున్నమి హోటల్ లో ఎలాంటి అనుమతులు లేకుండానే కొందరు ఫొటో షూట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో టూరిజం శాఖ అధికారులు వారిని అడ్డుకున్నారు. తాము మంత్రి జోగి రమేష్ అనుచరులమని, మమ్మల్నే అడ్డుకుంటారా అని ఆగ్రహంతో టూరిజం అధికారులపై చేయిచేసుకున్నారు. మంత్రి అనుచరులమని హోటల్లో దౌర్జన్యానికి పాల్పడడమే కాకుండా సిబ్బంది, అధికారులతో గొడవకు దిగి దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై టూరిజం అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనాస్థలికి చేరుకుని మంత్రి అనుచరులుగా పేర్కొంటున్నవారిని అదుపులోకి తీసుకున్నారుే.