Mahanadu 2022 : జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABP Desam   |  Satyaprasad Bandaru   |  28 May 2022 08:18 PM (IST)

Mahanadu 2022 : జిల్లాల విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజనను పునః సమీక్షిస్తామన్నారు. బుల్లెట్ లా దూసుకొచ్చి గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు అన్నారు.

మహానాడులో చంద్రబాబు

Mahanadu 2022 :  వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడు బహిరంగ సభలో మాట్లాడిన ఆయన సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్‌ను త్వరగా ఇంటికి పంపాలనే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోందన్నారు. క్విట్‌ జగన్‌-సేవ్‌ ఏపీ అని ఐదు కోట్ల ఆంధ్రులు కోరుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. మహానాడుకు ప్రజలు రాకుండా ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందన్నారు. పోలీసులు ప్రజల వాహనాలను అడ్డుకున్నారని, కారు టైర్లలో గాలి కూడా తీశారని ఆరోపించారు. టీడీపీ వెంట ప్రజలు ఉంటే, వైసీపీ వెంట బస్సులు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రజల కోసం పోరాడుతామన్న చంద్రబాబు, కొండనైనా బద్దలు కొట్టే శక్తి టీడీపీకి ఉందన్నారు. బాదుడే బాదుడుకు పోటీగా గడప గడపకు ప్రభుత్వం అని పెట్టారని, గడప గడపకు వెళ్లిన మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. 

మూడేళ్ల పాలనలో రూ.1.75 లక్షల కోట్లు 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరిందని చంద్రబాబు అన్నారు. సంక్షేమ పథకాలతో రూ.లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. సంక్షేమం అంటే టీడీపీ అన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పును జగన్‌ చెల్లిస్తారా అని ప్రశ్నించారు. క్వార్టర్‌ బాటిల్‌ ధర రూ.9 ఉండేదని, వైసీపీ ప్రభుత్వం రూ.21 చేసిందన్నారు. ఇందులో రూ.12 జగన్‌ జేబులోకి వెళ్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ మద్యం షాపులో కూడా బిల్లు ఇవ్వడం లేదన్నారు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ అమలుచేయరన్నారు. లిక్కర్‌ ద్వారా ఏటా జగన్‌ ఆదాయం రూ.5 వేల కోట్లు అని చంద్రబాబు ఆరోపించారు. బద్వేలులో 8 వేల ఎకరాలు కబ్జా చేశారన్న చంద్రబాబు, బెదిరించి అన్ని పరిశ్రమలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారన్నారు. మూడేళ్ల పాలనలో రూ.1.75 లక్షల కోట్లు దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అఖండ సినిమాను ఇబ్బంది పెట్టాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని చంద్రబాబు అన్నారు. బాలయ్య ప్రజలపై నమ్మకం ఉంచి సినిమా విడుదల చేశారని, అది సక్సెస్ అయిందన్నారు. సినిమా వాళ్లను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారా? అని ప్రశ్నించారు. 

బుల్లెట్లా దూసుకెళ్తా 

"సినిమా విడుదల చేయాలంటే మీ పర్మిషన్ కావాలా?. రేపు జగన్ కంపెనీ భారతీ సిమెంట్స్ కు పర్మిషన్ ఇచ్చేది నేనే. ఈ ప్రభుత్వం ఛార్జీలన్నీ పెరిగాయి. వీరబాదుడు బాదేస్తున్నారు.ప్రజలు అడగలేరనే ధైర్యం. ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేశారు. ప్రజల తరపున మేం పోరాడుతోంటే.. మాపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు. మేం భయపడేదే లేదు. బుల్లెట్లా దూసుకెళ్తాను. ఎన్ని కేసులైనా పెట్టుకో. మమ్మల్ని ఇబ్బందులు పెడితే వైసీపీ నేతలు భవిష్యత్తులో ఇదే రోడ్లపై తిరగాలి గుర్తుంచుకోండి. రౌడీలను గూండాలను వదిలి పెట్టేదే లేదు. వైసీపీ మోసకారి సంక్షేమం అమలు చేస్తోంది. సంక్షేమం పథకాలు మొదలు పెట్టిందే ఎన్టీఆర్. చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్పులు ఇవ్వడం లేదు." - - చంద్రబాబు, టీడీపీ అధినేత 

జిల్లాల విభజనపై 

జిల్లాల విభజనపై చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. అధికారంలోకి రాగానే జిల్లాల విభజనపై పునః సమీక్షిస్తామన్నారు. ప్రజల డిమాండ్లు,  అభిప్రాయాల మేరకు జిల్లాల విభజనపై అడుగులేస్తామన్నారు. మార్కాపురం జిల్లా డిమాండ్ ఉందని, దాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల ప్రజలు ప్రకాశం జిల్లాలోనే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వంపై యుద్దం ప్రకటించామన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఓ ఎకరం అమ్మిన డబ్బుతో ఏపీలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చన్నారు. 

 

Published at: 28 May 2022 08:18 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.