Nellore News : అసలే విద్యుత్ సమస్యలతో అల్లాడిపోతున్న ఏపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ప్రధాన కేంద్రంగా ఉన్న నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. మూడు పవర్ జనరేషన్ పాయింట్లు నిలిచిపోయాయి. ప్రమాద సమయంలో అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. ఇదే సమయంలో ప్లాంట్ కు తీరని నష్టం వాటిల్లింది. మూడో విద్యుత్ పవర్ జనరేషన్ పాయింట్ లో ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో అసలే అరకొరగా ఉన్న విద్యుత్ ఉత్పత్తికి మరో ఇబ్బంది ఎదురైంది. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్వహణలో తలెత్తిన లోపాలు ప్రధాన కారణమని నిర్వాహకులు భావిస్తున్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులోని ప్రధానమైన ఆఫర్లు కూలిపోవడంతో ఆ ప్రాంతమంతా కల్లోలంగా మారింది. చిమ్నీల నుంచి బూడిద విరజిమ్ముతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ లోపాల వల్ల ఈ నష్టం వాటిల్లినట్లు స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో మరోసారి రాష్ట్రానికి తీవ్ర విద్యుత్ సమస్య ఏర్పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రమాదంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
స్థానికుల్లో ఆందోళన
గత కొద్దిరోజులుగా నిర్వహణ లోపం కారణంగా ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఆఫర్ కూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్లాంట్ మొత్తం బూడిదమయం అయింది. చిమ్నీ నుంచి బూడిద వెదజల్లుతోంది. ఈ బూడిద కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో ఏపీ జెన్కోలో 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
అనధికారిక కోతలు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అనధికారిక విద్యుత్ కోతలు (Power Cuts) పెరిగిపోయాయి. ఇటీవల తుపాను కారణంగా వాతావరణం చల్లబడటంతో విద్యుత్ డిమాండ్ తగ్గింది. ఈ కారణంగా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా (Power Supply) చేయగలిగారు. పరిశ్రమలకు ప్రకటించిన పవర్ హాలీడేను దాదాపుగా నెలన్నర తర్వాత ఎత్తివేశారు. అయితే ఇటీవల ఏపీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. గాలులు కూడా తోడయ్యాయి. దీంతో కరెంట్ వినియోగం పెరిగింది. పవర్ హాలీడే (Power Holiday ) ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించడంతో పరిశ్రమలు కూడా పూర్తి స్థాయిలో కరెంట్ వినియోగించుకుంటున్నాయి. దీంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా మళ్లీ పెరిగింది.
Also Read : Power Cuts Again In AP : ఏపీలో మళ్లీ అనధికారిక విద్యుత్ కోతలు - డిమాండ్ పెరగడమే కారణం !