Pawan Kalyan On TDP Allaince : టీడీపీతో పొత్తుపై జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన కామెంట్స్ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర(Rythu Bharosa yatra)లో ఆయన పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారు. పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ జనసేనను బలోపేతం చేసే అడుగులు వేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వానికి(Ysrcp Govt) జనసేన వ్యతిరేకం కాదని, ఇది ఆ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పాలన చేయవచ్చని అభిప్రాయపడ్డారు. సంఖ్యా బలం ఉందని దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు పద్దతి మార్చుకోవాలని పవన్ హితవు పలికారు. 


బీజేపీతోనే పొత్తు


బీజేపీ(BJP)తో జనసేన పార్టీ అనుబంధం చాలా అద్భుతంగా ఉందని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. చంద్రబాబు(Chandrababu) త్యాగాలకు సిద్ధమని చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు పవన్ స్పందించారు. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. వ్యక్తిగతంగా తాను ఏ లాభాపేక్ష కోసం పొత్తులు పెట్టుకోనన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు(Vote Bank) చీలిపోయి మరోసారి వైసీపీ అధికారంలోకి రాష్ట్రం మరింతగా అంధకారంలోకి వెళ్లిపోతుందన్నారు. పరిస్థితులు మరింతగా దిగజారిపోతాయని పవన్ కల్యాణ్ విమర్శించారు. 


టీడీపీతో పొత్తులపై 


రాష్ట్ర భవిష్యతు కోసం కలిసి పనిచేయాలని చాలా మంది సూచించారని పవన్ కల్యాణ్ అన్నారు. ఓటు  చీలిపోతే రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రజలకు భరోసా కల్పించడానికి ఎంతవరకు అందరూ కలిసి వస్తారనేది భవిష్యత్తులో తేలుతుందని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని పవన్ అన్నారు. బీజేపీతో తమ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటే గౌరవం ఉందన్నారు. రోడ్ మ్యాప్(Road Map) అందిందా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు పవన్ స్పందించారు. రోడ్ మ్యాప్‌పై సరైన సమయంలో స్పందిస్తామన్నారు.  ఏడు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్య అన్న పవన్, చాలా ఆలోచించి కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన విషయాలు, వ్యూహాలు వెంటవెంటనే ఎందుకు చెప్తామన్నారు. సరైన సమయంలో పరిస్థితులను బట్టి చెప్తామని పవన్ అన్నారు. టీడీపీతో పొత్తులపై స్పందిస్తూ రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం బలమైన ఆలోచనా విధానంతో ముందుకెళ్తామన్నారు.