వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు పోస్టు మార్టం నివేదికను పరిశీలిస్తున్నారు. పోస్ట్‌మార్టం చేసిన పులివెందుల ఆస్పత్రి వైద్యుడు శ్రీనివాసనాయక్‌ను పిలిపించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఉన్న అంశాలపై తమకు ఉన్న అనుమానాలను నివృతి చేసుకున్నారు. వివేకా హత్య కేసులో పోస్టుమార్టం నివేదిక అత్యంత కీలకం. ఆయన మొదట గుండెపోటుతో చనిపోయారన్న ప్రచారం జరిగింది. ఆ తరవాత కుటుంబసభ్యులు కూడా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పోస్టుమార్టం అవసరం లేదని వైద్యులకు సమాచారం ఇచ్చారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న వివేకా కుమార్తె వైఎస్ సునీత పట్టుబట్టడంతో పోస్టుమార్టం చేయించారు. అప్పుడే వైఎస్ వివేకా మృతదేహానికి ఉన్న గాయాలన్నీ బయటపడ్డాయి. అప్పటి వరకూ గుండెపోటుగానే ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనుమానాస్పద మృతి అని చెప్పుకున్నారు. పోస్టుమార‌్టం రిపోర్టులో అవన్నీ పదునైన ఆయుధంతో దాడి చేసినట్లుగా తేల్చడంతో హత్యగా నిర్ధారించారు. ఈ కారణంగా సీబీఐ అధికారులు పోస్టుమార్టం నివేదికపై ప్రత్యేకమైన పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు తాము అరెస్ట్ చేసిన ఒకే ఒక్క నిందితుడు సునీల్ యాదవ్‌ను పది రోజుల పాటు కస్టడీకి తీసుకున్నా ఒక్క సమాచారం రాబట్టలేకపోయారేమో కానీ.. ఆయనకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో సీబీఐ అధికారులు ఉన్నారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేసి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. జమ్మలమడుగు మేజిస్ట్రేట్ వాదనలను వచ్చే నెల ఒకటో తేదీన వినననున్నారు. సునీల్ యాదవ్ కస్టడీలో ఉండగా చెప్పిన విషయాల ప్రకారం కొన్ని సోదాలు నిర్వహించి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ సీబీఐ అధికారులు ధృవీకరించలేదు.
మరోవైపు, ఇదే కేసులో మరో అనుమానితుడైన వివేకా డ్రైవర్ దస్తగిరితో వాంగ్మూలం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనను ప్రొద్దుటూరు తీసుకెళ్లినా పని కాకపోవడంతో మళ్లీ కడపకు తీసుకొచ్చారు. వివేకా చనిపోయినప్పుడు ఆయన డ్రైవరే కొట్టి చంపాడని వివేకా రాసినట్లుగా ఓ లేఖ బయటకు వచ్చింది. కొట్టి చంపుతూంటే ఎలా లేఖ రాస్తారన్న అనుమానాలు అప్పట్లో బయటకు వచ్చాయి. ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ లేఖను ఎవరు రాశారో రిపోర్ట్ వచ్చిందో లేదో స్పష్టత లేదు. వైఎస్ వివేకా కేసులో ఆధారాలు ఇస్తే రూ. ఐదు లక్షలు ఇస్తామంటూ పేపర్ ప్రకటన ఇచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తుపై పలువురు విమర్శలు చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన కేసుల్ని కూడా సాదాసీదా పోలీసులు చేధిస్తూంటే .. కాస్త దృష్టి పెడితే సులువుగా పరిష్కారమయ్యే కేసును ఎందుకు సాగదీస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.