Odisha Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లి  తెలుగువారిని కలిశామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అలాగే క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్  సహా పలు ఆస్పత్రులకు పంపినట్లు వివరించారు. ఏపీకి చెందిన వారు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 309 మంది ఉన్నారని, అలాగే యశ్వంత్ పురా లో 33 మంది ఉండగా.. మొత్తంగా 342 మంది తెలుగు ప్రజలు ఉన్నట్లు గుర్తించారు.


రైల్లో ప్రయాణించిన వారందరి వివరాలను గుర్తించామని.. ప్రమాదంలో ఏపీ రాష్ట్రానికి చెందిన  12 మందికి మైనర్ గాయాలయనట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం విశాఖలో 8 మందికి చికిత్స అందించామని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. జనరల్ బోగీల్లో ప్రయాణించిన శ్రీకాకుళంకు చెందిన గురుమూర్తి ఒక్కరే  మృతి చెందారన్నారు. జనరల్ బోగీల్లో వెళ్లిన వారిలో  ఇద్దరు విశాఖ, ఇద్దరు శ్రీకాకుళంకు చెందిన ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు తెలుసుకున్నామన్నారు. 



రైలు ప్రమాదంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 276 మంది మృతి చెందారని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. చనిపోయిన వారిలో 89 మందిని ఇప్పటి వరకు గుర్తించారన్నారు. ఇంకా 187 మృతదేహాలు మార్చురీల్లో ఉన్నాయని.. వాటిని గుర్తించాల్సి ఉందని వివరించారు. ఏపీకి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఇంకా భువనేశ్వర్ లోనే ఉన్నారని.. సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని కంట్రోల్ రూంకు కాల్స్ ఏవీ రావడం లేదన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అంబటి రాములు విజయవాడ నుంచి కోల్‌కతాకు వెళ్లారని మన కంట్రోల్ రూంకు ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. కంట్రోల్ రూం నుంచి వచ్చిన ఆ ఫిర్యాదును ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. బాధితులు ఎవరైనా కంట్రోల్ రూం లేదా వాట్సప్ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఘటన అనంతరం ఏపీ ప్రభుత్వం సహాయక చర్యల్లో సమర్థంగా వ్యవహరించిందన్నారు. ఘటనపై రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం , విమర్శలు చేయడం సరికాదని సూచించారు. 



ఇలా జరిగింది..


ఒడిశా రైల్వే ప్రమాదంపై ఉన్నతాధికారులు కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటికే రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ "ఎలక్ట్రానిక్ ఇంటర్‌లింకింగ్ సిస్టమ్‌"లో లోపం వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలిపారు. రైల్వే బోర్డ్ అధికారులు దీనిపై మరికొన్ని వివరాలు అందించారు. వాళ్లు చెప్పిన వివరాల ఆధారంగా చూస్తే.. ప్రమాదం జరిగిన బాలాసోర్‌లోని బహనగబజార్‌ వద్ద నాలుగు ట్రాక్‌లున్నాయి. ఇందులో మధ్యలో ఉన్న రెండు మెయిన్ లైన్స్. వీటికి రెండు వైపులా లూప్‌ లైన్స్ ఉన్నాయి. ఈ రెండు లూప్‌ లైన్స్‌లోనూ రెండు గూడ్స్ ట్రైన్‌లు ఐరన్‌ ఓర్‌ లోడ్‌తో ఉన్నాయి. అదే సమయానికి షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ చెన్నై నుంచి హౌరా వైపు వస్తోంది. అటు బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎదురుగా హౌరా నుంచి వస్తోంది. మధ్యలో ఉన్న రెండు మెయిన్‌ లైన్స్‌కీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 


కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 126కిలోమీటర్ల వేగంతో వస్తోంది. సిగ్నలింగ్‌లో పొరపాటు వల్ల కోరమాండల్ లూప్‌లైన్‌లోకి వెళ్లి గూడ్స్‌ని ఢీకొట్టినట్టు రైల్వే బోర్డ్ అధికారులు వివరించారు. అయితే.. ఇది కచ్చితంగా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే జరిగిందని చెప్పడానికి లేదని వెల్లడించారు.