వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్న వేళ, రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగుల బదిలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఓటర్ల తుది జాబితా పూర్తయ్యే వరకూ నియామకాలు, బదిలీ చేయాలంటే, ఎన్నికల ప్రధాన అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైన సిబ్బంది ఖాళీలపైనా, మంగళవారం లోపు వివరాలు సమర్పించాలని ఎంకే మీనా సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియలో ఉన్న వారి బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేశారు. 2023 అక్టోబర్ 27 నాటికి ముసాయిదా జాబితా, 2024 జనవరి 5 తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామన్నారు.
2024 జనవరి 5 నాటికి ఓటర్ల తుది జాబితా
2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని ఎంకే మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైన సిబ్బంది ఖాళీల పైనా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ వివరాలు ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియలోని అధికారులు, ఉద్యోగుల బదిలీకి వీల్లేదని స్పష్టం చేశారు. ఫోటో ఓటర్ల తుది జాబితా రూపకల్పన కోసం అన్ని ఖాళీలను పదవ లోగా భర్తీ చేయాలని సూచించారు. 2023 అక్టోబర్ 27 నాటికి ముసాయిదా జాబితా, అలాగే 2024 జనవరి 5 తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వాలంటీర్లను భాగస్వామ్యం చేయవద్దు
మరోవైపు ఎన్నికల విధుల్లో వాలంటీర్లను భాగస్వాముల్ని చేయొద్దని ఆదేశించినా, వారి ప్రమేయం ఎందుకు ఉంటోందని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సీరియస్ అయింది. ఇకపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని, వాలంటీర్లు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారని ప్రశ్నించింది. వాలంటీర్లు ఎవరి అనుమతితో వారు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని, ఇంటింటి సర్వేకు వాలంటీర్లను బీఎల్‌వోలు ఎందుకు తీసుకెళ్తున్నారని మండిపడింది. ఓట్ల తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి దరఖాస్తుల తిరస్కరణపై ఆరా తీసింది. భారీగా ఓట్లు ఎందుకు తొలగించారని, తొలగించే ముందు వారికి నోటీసులిచ్చారా నిలదీసింది.
లోపాలకు పూర్తి బాధ్యత వారిదే
కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లు భారీగా తొలగించారని, అధికార పార్టీకి అనుకూలంగా భారీగా బోగస్ ఓట్లు చేర్పించారనే ఆరోపణలు వచ్చాయి. అలాంటి వాటికి అస్కారమివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని, బీఎల్‌వోలకు ఈ అంశాల పట్ల అవగాహన కల్పించాలని సూచించింది. 175 నియోజకవర్గాల పరిధిలో వచ్చే ఫిర్యాదులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించింది. ఇంటిలో ఒకే డోర్ నంబర్‌తో భారీగా ఓట్లు, జీరో డోర్ నంబర్‌తో లక్షల ఓట్లపైన ఎన్నికల సంఘం సీరియస్ అయింది. బూత్, నియోజకవర్గ స్థాయిలో ఏ అధికారి ఓట్ల నమోదు ప్రక్రియ పరిశీలించి ఖరారు చేస్తారో వారే తప్పులు, లోపాలకు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది ఎన్నికల సంఘం.