Temperature in Andhra Pradesh: అమరావతి: దేశంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్నాయి. శుక్రవారం నంద్యాలలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 46.4 డిగ్రీలు, కడపలో 46.3 డిగ్రీలు నమోదు కాగా, శనివారం సైతం ఏపీలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అసలే వేసవికాలం అందులోనూ వడగాల్పులు, ఎన్నికల సమయం కావడంతో ప్రజలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది. ఆదివారం (మే 5న) 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, 247 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 


మే 7న ఆ జిల్లాల్లో వర్షాలు
మే 6న (సోమవారం నాడు) 15 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 69 వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. మే 7న (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్నిచోట్ల తేలికపాటి వర్షం పడుతుందని, ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు గొర్రెల కాపరులు చెట్ల కింద,  బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని పేర్కొన్నారు.


ఆదివారం తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు ఇవే
మే 5వ తేదీన ఏపీలో 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచనున్నాయి. శ్రీకాకుళంలో 4 మండలాలు, విజయనగరంలో 12 మండలాలు, పార్వతీపురం మన్యంలో 13 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.


ఆదివారం వడగాల్పుల తీవ్రత ఉన్న మండలాలు (247):
శ్రీకాకుళం 15  మండలాలు, విజయనగరం 12  మండలాలు, పార్వతీపురం మన్యం 2  మండలాలు, అల్లూరి సీతారామరాజు 5  మండలాలు, విశాఖ 1, అనకాపల్లి 12  మండలాలు, కోనసీమ 1, కాకినాడ 10  మండలాలు, తూర్పు గోదావరి 14  మండలాలలో వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు పండ్ల రసాలు, కొబ్బరి బొండం, నిమ్మరసం, మంచినీళ్లు ఎక్కువగా తాగాలని, తలపై టోపీ లాంటివి ధరించడం మంచిదని సూచించారు. 
ఏలూరు 7 మండలాలు, కృష్ణా 5 మండలాలు, ఎన్టీఆర్ 13 మండలాలు, గుంటూరు 14 మండలాలు, పల్నాడు 27 మండలాలు, బాపట్ల 3 మండలాలు, ప్రకాశం 23 మండలాలు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 24 మండలాలు, కర్నూలు 10 మండలాలు, వైయస్సార్ 19 మండలాలు, అన్నమయ్య 10 మండలాలు, తిరుపతి 17  మండలాలు, అనంతపురం 1, శ్రీసత్యసాయి 1, చిత్తూరులో విజయపురం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.


వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


ఏపీలో శనివారం నిప్పులు కురిపించిన భానుడు 
ప్రకాశం జిల్లా దరిమడుగులో రికార్డు స్థాయిలో 47.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. పలు జిల్లాల్లోనూ 45, 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైయస్సార్ జిల్లా కలసపాడులో 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో 46.2 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 46.1 డిగ్రీలు, కర్నూలు జిల్లా వగరూరులో 45.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా విజయపురిసౌత్ లో 45.4 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో 44.9 డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగనెల్లూరు, అనంతపురం జిల్లా హుస్సేన్ పురంలో 44.8 డిగ్రీలు, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 44.7 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలో 14 జిల్లాలో 43 డిగ్రీలు కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. అలాగే  28 మండలాల్లో తీవ్రవడగాల్పులు,187 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.


వీలైనంతవరకు ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని అప్రమత్తం చేశారు. శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.