Bhanakacherla Project | అమరావతి: పోలవరం- బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు ఆహ్వానించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సముద్రంలోకి వృథాగా పోతున్న నీళ్లనే బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం వినియోగించనుందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) కోరారు. కనుక ఎవరూ ఈ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని, తెలంగాణ నేతలు, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రతి ఏడాది 3 వేల టీఎంసీల మేర గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని, అందులో కేవలం 200 టీఎంసీలు మాత్రమే పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు వినియోగిస్తామని తెలిపారు.
అటవీ, పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నాలు
ఏపీ సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం - బనకచర్ల అనుసంధానం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై సమీక్ష జరిగింది. పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అటవీ పర్యావరణ అనుమతిపై దృష్టి సారించాం. భూ సేకరణ పై కూడా కసరత్తు జరుగుతోంది. తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కరువు సమస్యకు నదుల అనుసంధానమే పరిష్కారమని కేఎల్ రావు చాలా ఏళ్ల కిందటే సూచించారు.
తెలంగాణ నేతలు, ప్రజలు అర్థం చేసుకోవాలి
నదుల అనుసంధానం ద్వారా ప్రతి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది. ఖరీఫ్ ప్రారంభానికి ముందే ఈ ఏడాది నీటి నిల్వలు ఉన్నాయి. కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి నిల్వలు ఉన్నాయి. వర్షాలు మొదలవకముందే గోదావరి నుంచి నీరు సముద్రంలో వృథాగా కలిసిపోతుంది. అలా వృథాగా పోతున్న నీటిని వినియోగించుకుంటే తప్పేముంది. రాజకీయాల కోసమే తెలంగాణ నేతలు పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నారని వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిలో కొంత మేర ఉపయోగించుకుంటున్నామని తెలంగాణ నేతలు, ప్రజలు అర్థం చేసుకోవాలని’ కోరారు.
ఈ ఏడాది 200 టీఎంసీల నీళ్లు అదనంగా నిలిపాం. సీఎం చంద్రబాబు శాస్త్రీయంగా వాటర్ ఆడిటింగ్-వాటర్ మేనేజ్మెంట్ జరగాలని ఆదేశించారు. దాని ద్వారా ఇది సాధ్యమైంది. 365 రోజులు పంటలతో పచ్చగా ఉండాలని, బుడమేరులో పూడిక తొలిగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పిజియో మీటర్లు, సెన్షర్ల కొనుగోలుకు రూ.30 కోట్లు కేటాయించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చాం. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.3800 కోట్లు ఇచ్చామన్నారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా జులై కల్లా ఆయకట్టుకు, హంద్రీనీవా నీళ్లు చివరి ఆయకట్టుకు తీసుకెళ్తామన్నారు. ఉత్తరాంధ్ర కు గోదావరి జలాలను తీసుకెళ్లే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
నీటి లభ్యతపై బులెటిన్
‘తుఫాన్ బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీస్కుంటున్నాం. పంట కాలాన్ని ముందుకు తీసుకు వచ్చే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు. త్వరలోనే నీటి లభ్యత బులెటిన్ విడుదల చేస్తాం. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తాం. మద్దతు ధరలు సైతం కల్పిస్తాం. భూగర్భ జలాలు పెంచు కోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుందని’ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.