NIA Court Today : కోడికత్తి దాడిలో జగన్ కూడా కోర్టుకు రావాల్సిందే - మరోసారి ఎన్ఐఏ కోర్టు ఆదేశం !

కోడికత్తి దాడి కేసులో జగన్మోహన్ రెడ్డి విచారణకు రావాలని ఎన్ఐఏ కోర్టు మరోసారి ఆదేశించింది. తొలి ప్రత్యక్ష సాక్షి కూడా విచారణకు రాకపోవడంతో ఫిబ్రవరి 15వ తేదీకి విచారణ వాయిదా పడింది.

Continues below advertisement

NIA Court Today :   ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ పై జరిగిన కోడి కత్తి దాడికి సంబంధించిన కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు విచారణ ప్రారంభించిది. తొలి సాక్షిగా విశాఖ విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ హాజరు కావాల్సి ఉంది. ఈయన ప్రత్యక్ష సాక్షి. అయితే విచారణకు  గైర్హాజర్ అయ్యారు. లఆయన తండ్రి చనిపోవడంతో కోర్టుకు హాజరు కాలేకపోయారని దినేష్  తరపు న్యాయవాది  ఎన్ఐఏ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి పదిహేనో తేదీకి ఎన్ఐఏ కోర్టు వాయిదా వేసింది. 

Continues below advertisement

బాధితుడు కూడా కోర్టుకు రావాలన్న న్యాయమూర్తి 

ఇందులో విక్టిమ్ (బాధితుడు) షెడ్యూల్ కూడా ఉండాలని తెలిపింది. ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో... ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు... ఆరోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ చేశారు. దాడి జరిగిన నాలుగేళ్లు.. ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసిన చాలా కాలం తర్వాత విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా నిందితుడు జనపల్లి శ్రీనివాసరావును పోలీసులు కోర్టుు తీసుకు వచ్చారు. కేసు వాయిదా పడిన తర్వాత మళ్లీ జైలుకు తరలించారు. బాధితుడు జగన్మోహన్ రెడ్డి సైతం హాజరు కావాలని గతంలోనే ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఢిల్లీలో పెట్టుబడుల సన్నాహక సమావేశం ఉండటంతో జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. 

కోడికత్తి కేసులో అసలేం జరిగిందంటే ?

2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌  హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్‌..సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్‌ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది.  చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ హైదరాబాద్ చేరుకున్న తరవాత   సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అయింది. 

2019లోనే చార్జిషీటు దాఖలు చేసిన  ఎన్ఐఏ 

ఏపీ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న ద‌ర్యాప్తు మీద త‌మ‌కు అనుమానాలు ఉన్నాయని హైకోర్టులో వైసీపీ నేతలు పిటిషన్ వేయడంతో కేసును కోర్టు ఎన్ఐఏకు ఇచ్చింది.  విచారణ జరిపిన ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది.  ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్‌లో రాసుకున్న 22పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు.   ఈ కేసును రహస్యంగా విచారించాలని… విచారణకు సంబంధించిన వివరాలు మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని.. మీడియా కూడా విచారణకు సంబంధించిన వివరాలు ప్రచురించకూడదని అప్పట్లో ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

Continues below advertisement