బాక్సైట్ తవ్వకాలు ఇప్పుడు ఏపీలో రాజకీయాలకు కేంద్రంగా మారాయి.  అసలు బాక్సైటే తవ్వడం లేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. లేదు.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తరలిస్తున్నారని ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది. రాజకీయ ఆరోపణలు అలా నడుస్తూండగానే... మన్యం గిరిజనుల పేరుతో కొంత మంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఇచ్చిన ఎన్జీటీ ఆదేశాలు మరింత రాజకీయ రచ్చకు కారణం అవుతున్నాయి. 


అసలు లేటరైట్ / బాక్సైట్ వివాదం ఏమిటి...?
ఏపీలోని విశాఖ- తూర్పుగోదావరి మన్యం ప్రాంతంలో బాక్సైట్ విరివిగా లభిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. కానీ గిరిజనులు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో వెనక్కి తగ్గారు. తర్వాత బాక్సైట్ తవ్వకాల అనుమతుల్ని చంద్రబాబు ప్రభుత్వం.. ఇటీవల వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రద్దు చేసింది. అయితే కొంతకాలం నుంచి తూర్పుగోదావరి మన్యం ప్రాంతంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరలించడానికి ప్రత్యేకంగా రక్షిత అటవీ ప్రాంతంలో రోడ్డు కూడా వేసినట్లు దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం గిరిజనులకు దారి కోసం అని చెబుతోంది. అయితే అన్ని రకాల చట్టాలను ఉల్లంఘించి లేటరైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడమే కాకుండా... వేలాది చెట్లను తొలగించి రోడ్డు వేశారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో గిరిజనులు ఫిర్యాదు చేశారు. కొండ్రు మరిడయ్య అనే గిరిజనుడు ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్నారు. 


కీలక అంశాలపై ఎన్జీటీ విచారణ..
పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ఎన్జీటీ నిజాలు నిగ్గు తేల్చాలని నిర్ణయించుకుంది. కేంద్ర-రాష్ట్ర అధికారులతో కూడిన జాయింట్‌ కమిటీ విచారణ చేయాలని దిశానిర్దేశం చేసింది. కేంద్ర, రాష్ట్రాల అధికారులతో విచారణకు కమిటీని నియమించారు. తక్షణం మైనింగ్ జరుగుతున్నప్రాంతాన్ని పరిశీలించి వాస్తవిక, కార్యాచరణ నివేదికను అందించాలని ఆదేశించింది. అటవీ సంరక్షణ చట్టం, అటవీ హక్కుల చట్టంలోని నియమనిబంధనల ఉల్లంఘనలు జరిగాయా? ఒక వేళ అలాంటివేమైనా కనిపెడితే వాటిపై అటవీ శాఖ తరపున ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్వతంత్ర నివేదికను అందించాలని  ఆంధ్రప్రదేశ్‌ పీసీసీఎఫ్‌, అటవీ దళాల విభాగాధితి ని ఎన్‌జీటీ ఆదేశించింది.  మొత్తం ఏడు అంశాలపై విచారణ జరగనుంది.. 


ప్రభుత్వం ఏమంటోంది..
లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తరలిస్తున్నారన్న ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. కోర్టు ఉత్తర్వుల మేరకే.. ఓ మైనింగ్ లీజు ఇచ్చామని కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గనుల శాఖను చూస్తున్న ఉన్నతాధికారి ద్వివేదీ చెబుతున్నారు. ఆ లీజు కూడా టీడీపీ హయాంలో ఇచ్చిందేనని చెబుతున్నారు. ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని.. అక్కడ రోడ్డు నిర్మాణం కూడా నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని చెబుతున్నారు. అయితే, ఆ రోడ్డు నిర్మాణంపై వ్యతిరేక నివేదిక ఇచ్చిన ఆ ప్రాంత అటవీ శాఖ అధికారిని ప్రభుత్వం బదిలీ చేయడం వివాదాస్పదమయింది. 


ఎన్జీటీ విచారణకు ఏపీ సర్కార్ సహకరిస్తుందా..? 
ప్రస్తుతం ఎన్జీటీ నియమించిన విచారణ కమిటీలో ఒక్కరు కేంద్ర అధికారి ఉంటారు. మిగతా వారంతా ఏపీ అధికారులే ఉంటారు. ప్రభుత్వం ముందు నుంచీ అక్కడ అక్రమ మైనింగ్ లేదని చెబుతోంది కాబట్టి... విచారణ నివేదిక అందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఎన్జీటీ విషయం కాబట్టి.. అన్ని రికార్డెడ్, డాక్యుమెంటెడ్‌గాఉండాలి. అక్కడ తేడా వస్తే ఇబ్బంది.  రికార్జుల ప్రకారంగా.... డాక్యుమెంట్ల పరంగా ప్రభుత్వం సహకరిస్తుందా.. అన్న  సందేహాలు కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉన్నా... ఎన్జీటీ ఆదేశాలు మాత్రం సంచలనాత్మకం అయ్యాయి.