janasena News :  జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రను మూడో విడతగా విశాఖలో నిర్వహించనున్నారు.  ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్   నాదెండ్ల మనోహర్  సన్నాహక సమావేశం నిర్వహించారు.  మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర జనసేన నేతలకు నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. యాత్ర ఎక్కడ ప్రారంభం కావాలి.. ఏయే నియోజకవర్గాల గుండా సాగాలన్న అంశంపై చర్చించారు.  ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగిందని... అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలని దిశానిర్దేశం చేశారు.  నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలలని సూచించారు.  యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం విశాఖలో ఉంటుందని తెలిపారు. అదే విధంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశమై సమస్యలను తెలుసుకుంటారని స్పష్టం చేశారు. 


ఇక  పూర్తిగా మంగళగరిలోనే పవన్ కల్యాణ్ 
 
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పర్మినెంట్ అడ్రస్ ఇక మంగళగిరినేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  షూటింగ్‌లకు  మాత్రమే హైదరాబాద్ వెళ్తారు. ఇక అన్నిరకాల వ్యవహారాలు మంగళగిరి నుంచే నిర్వహిస్తారు. పార్టీ ఆఫీసులోనే పవన్ కల్యాణ్ అవసరాలకు తగ్గట్లుగా కొత్త నిర్మాణాలు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున పూర్తి స్థాయిలో రాజకీయం కోసం సమయం కేటాయిస్తున్నారు. కానీ కొన్ని సినిమాల కమిట్ మెంట్ విషయంలో పవన్ కల్యాణ్ కొంత సమయం కేటాయించక తప్పదని చెబుతున్నారు.  ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మంచి పొలిటికల్ సెటైర్లు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. అందుకే  దీన్ని ఎన్నికలకు ముందు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు కొన్ని రోజులు పవన్ కల్యాణ్ కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. 


పార్టీ అంతర్హక అంశాలపై పవన్ కసరత్తు 


విశాఖ నుంచి మూడో విడత యాత్ర కొనసాగించాలని నిర్ణయించడంతో  అక్కడ ఏర్పాట్లను ప్రారంభించారు.  వచ్చే వారం యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  పవన్ కల్యాణ్ ..  ప్రస్తుతం బలమైన నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని.. వాటిలో అభ్యర్థులపైనా చర్చలు జరుపుతున్నారు. పలువురు నేతలు వచ్చి పవన్ ను కలిసి వెళ్తున్నారు. పొత్తుల విషయంలో బయటకు పవన్ ఏం మాట్లాడుతున్నా..ఆయనకు స్పష్టత ఉందని...  పోటీ చేసే నియోజకవర్గాల విషయంలోనూ ఆయన క్లారిటీతో ఉన్నారని చెబుతున్నారు. ఎప్పుడు పొత్తులపై ప్రకటన చేయాలన్నది ..  రాజకీయంగా వ్యూహాత్మ నిర్ణయం అని.. టైమింగ్  చాలా ముఖ్యమని చెబుతున్నారు.


పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లోనే ప్రధానంగా వారాహియాత్ర


పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లోనే ప్రధానంగా వారాహియాత్రను నిర్వహించాలని పవన్ భావిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో యాత్రను నిర్వహించారు. అక్కడ వచ్చిన జన స్పందన పట్ల జనసన నేతలు సంతోషంగా ఉన్నారు. విశాఖలోనూ ఆ స్థాయిలో యాత్ర విజయవంతం అయ్యేలా చేయాలనుకుంటున్నారు. పవన్ గత ఎన్నికల్లో.. గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అందుకే ఈ సారి విశాఖను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.