Australian Open 2023:  గతేడాది ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ తర్వాత వరుసగా విఫలమవుతూ  తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియా ఓపెన్‌లో అదరగొడుతోంది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్  - 2023లో పీవీ సింధు.. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ గండం దాటి క్వార్టర్స్‌కు చేరింది.  ప్రీ క్వార్టర్స్‌లో  సింధు.. 21-14, 21-10 తేడాతో భారత్‌కే చెందిన మరో షట్లర్  ఆకర్షి కష్యప్‌ను ఓడించింది.  పురుషుల  సింగిల్స్‌లో మరో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్.. 21-10, 21-17 తేడాతో చైనీస్ తైఫీ  ప్లేయర్ సు లి యాంగ్‌ను ఓడించాడు. 


సింధు - కశ్యప్ మధ్య జరిగిన ప్రీ క్వార్టర్స్ పోరులో ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన లేకుండానే  డబుల్ ఒలింపిక్ మెడల్ సాధించిన సింధు.. క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. తొలి సెట్‌లో  కాస్త  పోటీనిచ్చిన ఆకర్షి.. రెండో సెట్‌లో తేలిపోయింది.  


కిదాంబి  శ్రీకాంత్ తొలి సెట్‌ను ఈజీగానే గెలుచుకున్నా  రెండో సెట్‌లో మాత్రం  సు లీ  పోటీనిచ్చాడు. కానీ భారత స్టార్ అతడికి  కోలుకునే అవకాశమివ్వకుండా  మ్యాచ్‌ను ముగించాడు. పురుషుల ప్రీక్వార్టర్స్‌లోనే మరో యువ భారత ఆటగాడు ప్రియాన్షు రజవత్.. 21-8, 13-21, 21-19 తేడాతో వాంగ్  జు వీ పై గెలుపొందాడు.


 






పురుషుల సింగిల్స్‌లో నేడు మిథున్ మంజునాథ్.. లీ జి జియాతో పోటీ పడనున్నాడు.  కిరణ్ జార్జ్.. అంథోని గింటింగ్‌తో ఆడనుండగా  హెచ్ ఎస్ ప్రణయ్.. చి యు  జెన్‌తో పోటీ పడనున్నాడు. ఉమెన్స్ డబుల్స్‌లో త్రిసా జాలీ - గాయత్రి గోపీచంద్‌ల జోడీ.. మయు మటుసుమొటొ-వకన నగరలతో ఆడనుంది. 


 






ఆస్ట్రేలియా ఓపెన్‌ను విజయంతో ఆరంభించిన సింధు తన జోరు కొనసాగిస్తుండటం గమనార్హం. తొలి మ్యాచ్‌లో సింధు.. భారత్‌కే చెందిన  అష్మిత చహిలాను ఓడించి ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.  ప్రీ క్వార్టర్స్‌లో కూడా ఆమె  మరో భారత షట్లర్‌తో తడబడటం గమనార్హం.  యూఎస్ ఓపెన్ తర్వాత   సింధు క్వార్టర్స్‌కు చేరడం ఇదే ప్రథమం.  ఇటీవలే జపాన్, మలేషియా, కొరియా ఓపెన్‌లు ఆడిన సింధు..  మునపటి ఫామ్ కోల్పోయి తంటాలు పడింది. మరి కొత్త కోచ్‌తో ఆడుతున్న సింధు..  ఆస్ట్రేలియా ఓపెన్ లో అయినా రాణిస్తుందేమో చూడాలి.  ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత సింధు ఆసియా క్రీడల్లో పాల్గొనాల్సి ఉంది.  ఇక్కడ చైనా, కొరియా ఆటగాళ్ల దాడిని ఎదుర్కోవాలంటే సింధుకు ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడం అత్యంత ఆవశ్యకం. 


 


























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial