అనంతపురం ప్రజల డిమాండ్ నెరవేరింది. ఎప్పటినుంచో వారు అడుగుతున్న అనంతపురం - బెంగుళూరు ప్యాసింజర్ ట్రైన్ అందుబాటులోకి వచ్చేసింది. బెంగళూరు నుంచి పుట్టపర్తి వరకు వెళ్లే ట్రైన్ ను ఇటీవల అనంతపురం వరకూ పొడిగించింది రైల్వే శాఖ. ఆ ప్రయోగం సక్సెస్ కావడంతో కేవలం 50 రూపాయల ఖర్చుతో అనంతపురం నుంచి బెంగళూరు వరకూ వెళ్లగలుగుతున్నారు అక్కడి ప్రజలు.
జస్ట్ 50 రూపాయలతో బెంగుళూరుకు ప్రయాణం
అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లాలంటే బస్సుకి 365 రూపాయలు, ట్రైన్ కి స్లీపర్ లో 205, 3rd AC కి 555 రూపాయల ఖర్చు అవుతుంది. దానితో అనంతపురం నుంచి బెంగళూరుకు ఒక ప్యాసింజర్ ట్రైన్ వేయాలంటూ అక్కడి ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. రైల్వే శాఖ ఇప్పుడు ఆ డిమాండ్ ను తీర్చింది. బెంగళూరు నుంచి పుట్టపర్తి వరకు ప్రయాణించే మెము (MEMU) ప్యాసింజర్ ట్రైన్ ను అంతపురం వరకు పొడిగించింది. ఈ ట్రైన్ లో అనంతపురం నుంచి బెంగళూరు వరకు జస్ట్ 50 రూపాయల ఖర్చుతో ప్రయాణించవచ్చు.
66559 నెంబర్ తో KSR బెంగుళూరు లో ఉదయం 8:35కి బయలు దేరే ఈ ట్రైన్ మధ్యాహ్నం 1:55 కి అనంతపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం లో అనంతపురం లో 66560 నెంబర్ తో అనంతపురం లో మధ్యాహ్నం 2:10కి బయలుదేరి బెంగళూరు కు రాత్రి 7:50 కి చేరుకుంటుంది. బెంగుళూరు, అనంతపురం మధ్యలో బయప్పనహళ్లి, యెలహంక, ధర్మవరం,పెనుకొండ, హిందూపురం పుట్టపర్తి, జంగాలపల్లి లాంటి 25 స్టేషన్ లలో ఆగుతుంది.
ప్రతీ చిన్న పనికి బెంగళూరు పై ఆధారపడే వ్యాపారులు ఉద్యోగులు, స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్న ఈ రూట్ లో కొత్తగా వేసిన ఈ ట్రైన్ చాలా ఉపయోగకరం అంటున్నారు అనంతపురం ప్రజలు.