అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం లో దారుణం జరిగింది. బాకీ తీర్చలేదని ఒక మహిళను పాశవికంగా చెట్టుకు కట్టేసి  హింసించిన వైనం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ సంఘటన జరిగింది.భర్త చేసిన అప్పు తీర్చలేదని భార్యను చెట్టు కట్టేసిన చిత్రహింసలు పెట్టిన వైనం పై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడేళ్ల‌ క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నారు శిరీష‌ (25), ఆమె భర్త తిమ్మరాయప్ప. అయితే అప్పు తీర్చలేక  భార్య శిరీష (25)ను బిడ్డలను మరియు గ్రామాన్ని వదిలివెళ్ళిపోయాడు భర్త తిమ్మరాయప్ప.కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్న శిరీషను సకాలంలో  రుణం చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా  ఆపి అసభ్య పదజాలంతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపిస్తామని బెదిరించారు మునికన్నప్ప అతని అనుచరులు.ఆమె ను ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో వేప చెట్టుకు  కట్టేసి అవ‌మానించిన మునికన్నప్ప వ్యవహారం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఆమెను విడిపించారు.

సీయం ఆగ్రహం-SPకి ఫోన్

తన సొంత నియోజకవర్గం లో జరిగిన ఈ సంఘటన పై ముఖ్య మంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా SP కి ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించారు.  నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపిన జిల్లా ఎస్పీతో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సిఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.