Adabidda Nidhi Scheme: సూపర్ సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వం చాలా దూకుడుగా ఉంది. ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పడుతున్న వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు వేగవంతం చేయాలని చూస్తోంది. ఇప్పటికే కొన్ని పథకాలు ఏడాది ఆలస్యమైంది. ఇకపై ఆలస్యం చేస్తే విపక్షాల నుంచి కాకుండా ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తాయని గ్రహించి వాటిపై స్పషెల్ ఫోకస్ పెట్టింది. అర్హులు మిస్ అవ్వకుండా అనర్హులకు పథకాలు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లుల ఖతాల్లో నగదు జమ చేసింది. ఇదే నెలలో రైతుల ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనుంది. ఆగస్టులో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం స్టార్ట్ చేయనుంది.
కూటమి సర్కారు వచ్చి ఏడాది అవుతోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు మొదటి నెలల నుంచే పింఛన్లు పెంచింది. అంతేకాకుండా ఏకంగా బకాయిలను కూడా ఇచ్చింది. తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అన్న క్యాంటీన్లు భారీగా ఏర్పాటు చేసింది. తల్లికి వందనం ప్రారంభించింది. ఇప్పుడు మహిళలకు ఇచ్చిన మరో పథకం అమలుపై ఫోకస్ చేసింది. అర్హులైన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తామంటూ ఎన్నికల్లో మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకం అమలుపై ఫోకస్ చేశారు. అర్హుల గుర్తింపు నుంచి వారి రిజిస్ట్రేషన్ వరకు అన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందిస్తున్నారు. ఇందులో నేరుగా అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. పథకం అమలు అయిన తర్వాత వచ్చే ఫిర్యాదులు, ఎదుర్కొనే సమస్యలు ఇతర ఇబ్బందులను పరిష్కారం కోసం ఈ వెబ్‌సైట్ ఉపయోగపడనుంది. ఈ పథకానికి ఎవరు అర్హులో కూడా ఇందులో తెలిసిపోనుంది. అర్హులు ఇందులో నేరుగా అప్లై చేసుకోవచ్చు. లేదా మీసేవ కేంద్రాల్లో, సచివాలయంలో కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నారు.
ఎవరు అర్హులు ఈ పథకానికి అర్హత విషయం ఇంకా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ తెల్లరేషన్ కార్డు ఉన్న వాళ్లను అర్హులుగా చేసే అవకాశం ఉంది. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వీటితోపాటు మిగతా పథకాలకు సంబంధించిన అర్హతలు వర్తిస్తాయి. ఏడాదికి 18000 రూపాయలు ఇస్తున్నందున నిబంధనలు కూడా కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే పథకానికి అర్హులైన వారు తమ బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్‌కార్డు వివరాలు, రేషన్ కార్డు వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. పథకాల లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివ్‌గా ఉంచుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా చాలా మంది ఖాతాల్లో వేసిన డబ్బులు తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి చేరాయి. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు యాక్టివ్‌గా లేనందున ఈ సమస్య ఏర్పడింది. అందుకే అర్హులైన వారంతా తమ ఖాతాలకు ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆడబిడ్డ నిధి కోసం ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రూ.3,300 కోట్లు ఈ పథకం కోసం కేటాయిస్తున్నట్టు బడ్జెట్ స్పీచ్‌లో ఆర్థిక మంత్రి వెల్లడించారు. అప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు వివిధ కేటగిరి మహిళలకు ఈ నిధులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసినట్టు పేర్కొన్నారు.