New Traffic Rules: మద్యం సేవించి వాహనాన్ని నడిపే మందుబాబులు తస్మాత్ జాగ్రత్త.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకు అంత జాగ్రత్త.. దొరికితే ఏముందిలే 500 రూపాయలు ఫైన్ కట్టి బయట పడదాం అనుకుంటున్నారా! ఇక మీ పప్పులు ఉడకవు లెండి. కాకినాడ, కోనసీమ జిల్లాల కేంద్రాలైన కాకినాడ, అమలాపురంలో ఇటీవల న్యాయ స్ధానాలు వెలువరించిన తీర్పులు చూసి దెబ్బతో తలకెక్కిన నిషా కాస్తా దిగొస్తోంది. ఇటీవల కాకినాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డ 39 మందిపై మోటారు వెహికల్ చట్టం సెక్షన్ 184 కింద కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు పోలీసులు.
అదనపు జేఎఫ్ సీఎం న్యాయమూర్తి శారదారెడ్డి ఈ కేసుల్లో నిందితులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు జరిమానా విధించారు. అంతేకాదు జరిమానా కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వారం రోజుల పాటు జైలుకు వెళ్లాలని ఆదేశించారు. ఇదిలా ఉంటగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలని రవాణా శాఖ ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపనున్నామని స్థానిక అధికారులు తెలిపారు.
అమలాపురంలోనూ షాక్..
ఇటీవల అమలాపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుపడ్డ ఓ వ్యక్తికి అమలాపురం అడిషనల్ జ్యూడిషయల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీలక్ష్మి రూ. 10 వేలు తోపాటు మూడు రోజుల సాధారణ జైలు విధించారు. అంబాజీపేట మండలం ముక్కామలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన పోలీసులకు మలికిపురం మండలంకు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి కోర్టు లో హాజరు పరిచారు పోలీసులు. విచారణ చేసిన జడ్జి ఎవ్వరూ ఊహించని షాక్ ఇచ్చారు.
మందుబాబుల గుండెల్లో గుబులు..
మద్యం సేవించి పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్న వారి కథలు, అనుభవాలు తెలుసుకుంటున్న ఇతర మందు బాబుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇంత వరకు తక్కువ స్థాయిలో జరిమానాలు విధించిన కోర్టులు ఇప్పుడు భారీ స్థాయిలో జరిమానా విధించడంతో పాటు జైలు కూడా వేస్తోంది. దీంతో తాగుబోతుంతా భయపడి పోతున్నారు. తాగి రోడ్డు మీదకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారు. అంతే కాదు అటు రవాణాశాఖ అధికారులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డవారి వాహన డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేయాలని ప్రతిపాదనలు పంపడం కూడా షాక్ ఇచ్చే అంశంగా మారింది. అందుకే మందు బాబులు తస్మాత్ జాగ్రత్త.
ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగకండి. ఒకవేళ తాగినా వాహనం అస్సలే నడపకండి. వీలైనంత వరకు ఇంట్లోనే తాగి పడుకోవడం మంచిది. కాదని రోడ్ల మీదకు వెళ్లారంటే ఎక్కవ మొత్తంలో జరిమానాలతో పాటుగా జైలు శిక్ష లేదా లైసెన్స్ కోల్పోవడం జరుగుతుంది.