YSRCP vs Janasena Flexi War In Kavali: 


కావలిలో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ గొడవ ముదిరి పాకాన పడింది. జనసైనికుల్ని కవ్విస్తూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టడంతో ఈ గొడవ మొదలైంది. తిరిగి జనసేన కూడా జగన్ కి వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శించి ఫ్లెక్సీలు కట్టడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ గొడవ కేసుల వరకు వెళ్లింది. జనసేన నాయకులకు మద్దతుగా లీగల్ సెల్ ప్రతినిధులు రావడంతో పోలీసులు వారిని వదిలిపెట్టారు. 


కావలిలోని ఉదయగిరి వంతెన వద్ద ఇటీవల కొంతమంది ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయగలరా? ప్రతిపక్షానికి, దత్తపుత్రుడికి సవాల్‌’ అంటూ ఆ ఫ్లెక్సీ వేశారు. కచ్చితంగా ఇదీ వైసీపీ నేతల పనేనంటూ జనసైనికులు మండిపడ్డారు. ఆ ఫ్లెక్సీని తొలగించాలంటూ ఆదివారం కావలిలో రాస్తారోకో నిర్వహించారు. అలాంటి ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలంటూ మున్సిపల్‌ కమిషనర్‌ కి ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు. అయితే ఆదివారం సెలవు కాబట్టి, సోమవారం రోజు ఫ్లెక్సీ తొలగిస్తామన్నారు కమిషనర్. కానీ సోమవారం ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించలేదు. దీంతో జనసేన నేతలు పోలీసుల్ని కూడా ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ కల్యాణ్ ని వెటకారం చేస్తూ వేసిన ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించలేదని ఆరోపించారు. 


 






కమిషనర్ కారుని అడ్డుకోవడంతో గొడవ..
చివరకు జనసేన నేతలు ఆ విషయాన్ని కమిషనర్ వద్దే తేల్చుకుంటామని పట్టుబట్టారు. కమిషనర్ కారుని అడ్డుకున్నారు. అక్కడ్నుంచి అసలు కథ మొదలైంది. తన విధులకు ఆటంకం కల్పిస్తున్నారంటూ జనసేన నేతలపై కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 18మందిపై కేసులు నమోదు చేశారు. 


పోలీసులు కేసులు నమోదు చేసినా తగ్గేది లేదంటూ జనసేన నేతలు కావలిలో భారీ ర్యాలీ చేపట్టారు. సీఎం జగన్‌ ను ఘాటుగా విమర్శిస్తూ మరో ఫ్లెక్సీ తయారు చేయించారు. ‘పాపం పసివాడు.. సీబీఐ దత్తపుత్రుడు 420 కాదని నిరూపించగలరా..?’ అంటూ జగన్‌ ఫొటోతో ఫ్లెక్సీ వేయించి కావలిలో ర్యాలీ చేపట్టారు. ట్రంకురోడ్డులో ఫ్లెక్సీని ఊరేగించి.. ఉదయగిరి వంతెన వద్ద పోటీగా దాన్ని కట్టారు. పోటా పోటీ ఫ్లెక్సీల గొడవలో కావలి పోలీసులు అక్కడికి తరలి వచ్చారు. చివరకు డీఎస్పీ దగ్గర పంచాయితీ జరిగింది. 


అది ఉంచారు, ఇది తీసేశారు..
పోటా పోటీగా వేసిన ఫ్లెక్సీల్లో ఒకదానిని పోలీసులు తొలగించారు. వైసీపీ నేతలు వేసినట్టు అనుమానిస్తున్న ఫ్లెక్సీని పోలీసులు అలాగే ఉంచారు, జనసేన నేతలు వేసిన ఫ్లెక్సీని మాత్రం తొలగించారు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఇందులో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు కుమ్మక్కై తమకు అన్యాయం చేశారంటూ జనసేన నేతలు ఆందోళనకు దిగారు. 


నాన్ బెయిలబుల్ కేసులు..
ఈ గొడవలో జనసేన నేతలపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని తప్పుబడుతూ లీగల్ సెల్ నేతలు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఫ్లెక్సీలు వేసినందుకు నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారంటూ నిలదీశారు. దీంతో పోలీసులు దిగివచ్చారు. వారిపై బెయిలబుల్ కేసులుపెట్టి విడుదల చేశారు. మొత్తమ్మీద కావలి పట్టణంలో పోటీ పోటీ ఫ్లెక్సీలు పెద్ద గొడవకు దారి తీశాయి.