YSRCP MLA Anil Kumar strong counter to chandrababu:
చంద్రబాబుకి ఐటీ నోటీసుల వ్యవహారంలో పవన్ కల్యాణ్ మౌనం వెనక పరమార్థమేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రశ్నిస్తానంటూ ట్విట్టర్లో పదే పదే సీఎం జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించే పవన్, ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారని అడిగారు. బాబు అవినీతిలో పవన్ కి కూడా వాటా ఉందా అని ప్రశ్నించారు. ఆ వాటాల లెక్కలు తేలాలని డిమాండ్ చేశారు అనిల్.
మన్ను తిన్న పాము..
ఐటీ నోటీసులపై చంద్రబాబు కనీసం స్పందించడంలేదని, మన్ను తిన్న పాములాగా సైలెంట్ గా ఉన్నారని విమర్శించారు అనిల్. చంద్రబాబు అవినీతికి పాల్పడకపోతే రూ.118 కోట్ల ముడుపులను ఎందుకు లెక్కల్లో చూపించలేదని ప్రశ్నించారాయన. పీఏ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని అన్నారు. తాను సత్యహరిశ్చంద్రుడిని అని చెప్పుకునే చంద్రబాబు, ఐటీ నోటీసులపై సమాధానం చెప్పాలన్నారు అనిల్.
మీడియాకి కూడా వాటా ఉందా..
చంద్రబాబు అవినీతిలో రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులకు కూడా వాటాలున్నాయని ఆరోపించారు అనిల్. అందుకే వారు కూడా నోరెత్తటం లేదని, చంద్రబాబు అనుకూల మీడియాలో ఎక్కడా నోటీసుల ప్రస్తావన లేదని చెప్పారు. నోటీసుల వ్యవహారాన్ని కవర్ చేసుకోడానికి తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని నక్కి నక్కి విన్నట్టుగా రాసే మీడియా ఛానెళ్లు ఇప్పుడు చంద్రబాబు నోటీసులపై ఎందుకు స్పందించలేదన్నారు అనిల్. నోటీసులపై వార్తలు రాయకపోతే వారికి కూడా వాటాలందాయనేది నిజం అని ఒప్పుకోవాలన్నారు.
మరిదికోసం ఎన్ని కష్టాలు..
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ పై విమర్శల డోస్ పెంచిన పురందరేశ్వరి కూడా చంద్రబాబు విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు అనిల్. ఆమె కూడా తన మరిదిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ లకు దుబాయ్ లో కూడా ముడుపులు అందాయన్నారు అనిల్. అమరావతి అనే బొమ్మ వెనుక జరిగిన భారీ అక్రమాలకు ఇది శాంపిల్ మాత్రమేనని చెప్పారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలను చంద్రబాబు కలవడానికి కారణం కూడా ఇదేనన్నారు. ఈ ఐటీ కేసులనుంచి బయటపడేయాలని వారిని బాబు బతిమిలాడుకున్నారని చెప్పారు. ఇంకా లోతుగా విచారణ జరిపితే భారీ అక్రమాలు బయటకు వస్తాయని చంద్రబాబు భయపడుతున్నారని, వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
వామపక్షాలకు ఏమయింది..?
అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే వామపక్షాలకు నోరు పడిపోయిందా అని ప్రశ్నించారు అనిల్. చంద్రబాబు ఐటీ నోటీసులపై వామపక్షాలు ఎందుకు స్పందించడంలేదన్నారు. వారికి కూడా ముడుపులు అందాయనే అనుమానాలున్నాయని చెప్పారు.
చంద్రబాబుకు శక్తి, వయసు అయిపోయిందని, ఆయన చేసిన పాపాలకు ఇప్పుడు పరిహారం చెల్లించాల్సిన సమయం వచ్చిందని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. అమరావతి పేరుతో కొల్లగొట్టిన నిధుల్లో ఇది కొంత మాత్రమేనని, లోతైన విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు అనిల్. తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వెళ్లి మరీ అనిల్, చంద్రబాబు వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టారు. ఐటీ నోటీసుల విషయంలో ఘాటుగా స్పందించారు.