Somireddy Reaction on udayanidhi Stalin Comments:


సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఆ గొడవపై స్పందించకపోయినా సోమిరెడ్డి మాత్రం తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఉదయనిధి స్టాలిన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణ చెప్పకపోతే తన మాటలకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని, దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. 


ఉదయనిధి స్టాలిన్ చిన్నపిల్లాడని, అతనికి భారత సనాతన ధర్మం యొక్క సారాంశం తెలియకపోవచ్చని అన్నారు సోమిరెడ్డి. అజ్ఞానాన్ని మన్నించవచ్చు కానీ, ఉదయనిధి.. కోట్లాది మంది ప్రజల విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని చెప్పారు. ప్రజల విశ్వాసాలపై రాళ్లు రువ్వాలని అనుకోవడం అతని అహంకారానికి నిదర్శనం అని చెప్పారు. దీన్ని అందరూ ఖండించాలని చెప్పారు. అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు అందరికీ ఉంటుందని, అదే సమయంలో ఇతరుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే స్వేచ్ఛ ఎవరికీ లేదన్నారు సోమిరెడ్డి. ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 


 






సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ వైరల్ గా మారింది. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటముల మధ్య ఊగిసలాడుతున్న టీడీపీ ఉదయనిధి స్టేట్ మెంట్ పై స్పందించకుండా ఉంటుందని అనుకున్నామని, కానీ సోమిరెడ్డి స్పందన తమకు సంతోషాన్నిచ్చిందని అంటున్నారు కొంతమంది. సోమిరెడ్డి లాగే నాయకులు తమ అభిప్రాయాలను చెప్పాలని డిమాండ్ చేశారు. 


ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు..?
‘సనాతన నిర్మూలన’ అనే అంశంపై తమిళనాడులో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్.. సనాతనాన్ని నిర్మూలించాల్సిందేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని కూడా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం తిరోగమన సంస్కృతి అని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు అది వ్యతిరేకం అన్నారు. 


ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఇటు నెల్లూరులో కూడా ఉదయనిధి వ్యాఖ్యలకు నిరసనగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రదర్శన చేపట్టాయి. డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన హిందూ ధర్మం పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నెల్లూరు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉదయ నిధి స్టాలిన్ దిష్టి బొమ్మకు శవయాత్ర చేసి దహనం చేశారు. ఈ కార్యక్రమం లో హిందూ చైతన్య వేదిక నాయకులు పాల్గొన్నారు.


భారత దేశ సంస్కృతి లో అంతర్భాగం అయిన సనాతాన ధర్మం ప్రపంచ శాంతిని కోరుతుందని.. అలాంటి ధర్మం గురించి మూర్ఖులకు అర్ధం కాదని అన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించాలన్నారు. అంతేకానీ ఇలా కించపరిచేలా మాట్లాడి మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు నేతలు. ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.