Gold missing at police station In Nellore:


నెల్లూరు జిల్లాలో ఓ ఎస్సై చేతివాటం ఇప్పుడు ఆయన సహోద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ ఎస్సై పనిచేసిన సమయంలో స్టేషన్లో ఉంచిన 750 గ్రాముల బంగారం మాయం కావడంతో దాన్ని వెతికి పట్టుకోవడం మిగతావారికి తలనొప్పిగా మారింది. ఆయన ట్రాన్స్ ఫర్ అయి వెళ్లిపోయారు, ఇప్పుడు బంగారం కనపడ్డంలేదు. త్వరలో కోర్టు కేసులో ఆ బంగారాన్ని రికవరీగా చూపెట్టాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం ఆ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఏం చేయాలో తెలియడంలేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తిరిగి వారికే చీవాట్లు పెట్టారు. గడువులోగా ఆ బంగారాన్ని రికవరీ చేయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


అసలేం జరిగింది..?
నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో దాచిన 750 గ్రాముల బంగారం మాయమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఈ బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా సందర్భంగా వారి వద్ద బంగారం కూడా ఉండటంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. 750 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. ఎర్రచందనం దుంగలతోపాటు, బంగారాన్ని కూడా స్టేషన్లో ఉంచారు. రెడ్ శాండిల్ కేసు నమోదు చేసిన సమయంలో బంగారం వ్యవహారాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడంతో అది అధికారికంగా మారింది. 


ఎస్సై చేతివాటం..
రెడ్ శాండిల్ పట్టుకున్న సమయంలో ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై ఇటీవల బదిలీపై వెళ్లారు. ఆ తర్వాతే బంగారం మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. ఎర్రచందనం కేసు కోర్టులో తుది దశకు చేరుకుంది. ఈ టైమ్ లో కోర్టులో బంగారాన్ని కూడా సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి. కానీ స్టేషన్లో బంగారం లేదు. ఏమైందని ఆరా తీస్తే ఆ ఎస్సై దాన్ని చాకచక్యంగా మాయం చేసినట్టు తెలుస్తోంది. నేరుగా ఆయన్ను అడగలేరు, అలాగని కోర్టుకి సమాధానం చెప్పలేరు. దీంతో పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనం సంచలనంగా మారింది. అయితే గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేయాలనుకుంటున్నారు పోలీసులు. 


ఉన్నతాధికారుల ఆగ్రహం..
కోర్టు కేసు తరుముకొస్తోంది, కోర్టులో 750 గ్రాముల బంగారాన్ని చూపించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఎఫ్ఐఆర్ లో కూడా అది రిజిస్టర్ కావడంతో తప్పనిసరిగా మారింది. కానీ ఇక్కడ బంగారం లేదు. తక్కువమొత్తం అయితే ఎలాగోలా మేనేజ్ చేసేవారు. కానీ ముప్పావు కేజీ బంగారం అంటే ఎక్కడినుంచి తేవాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు చెబితే వారు కూడా ప్రస్తుతం ఉన్న సిబ్బందిపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తక్షణం బంగారం రికవరీ చేయాలని, లేకపోతే బదిలీపై వెళ్లిన సదరు అధికారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించడంతో విచారణ మొదలు పెట్టారు. గతంలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఎస్సై వద్ద ఆ బంగారు ఆభరణాలు రికవరీ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇదంతా గుంభనంగా జరుగుతోంది. 


పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరగడం, అందులోనూ పోలీసుల హస్తం ఉందని తేలడంతో ఈ దొంగతనం వ్యవహారాన్ని బయటకు రానివ్వడంలేదు పోలీసులు. అధికారికంగా దీనిపై ఎలాంటి సమాచారం వారు చెప్పడంలేదు. అయితే బంగారం మాత్రం ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో లేకపోవడం విశేషం. కోర్టు కేసు సమయానికి దాన్ని రికవరీ చేసి స్టేషన్లో పెట్టడానికి ప్రస్తుత సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.