నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా తనకు ఉన్న నలుగురు గన్ మేన్ లలో ఇద్దరిని తొలగించిందని ఆవేదన చెందారు. అది ప్రభుత్వం తనకు ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు. తాను కూడా ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని, అందులో భాగంగా తనకు ఉంచిన ఇద్దరు గన్ మేన్‌లను కూడా ఇచ్చేస్తున్నానని అన్నారు. వారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నానని చెప్పారు. ఆదివారం (జనవరి 5) నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు గన్ మేన్ లకు వీడ్కోలు పలుకుతుండగా వారు కంటతడి పెట్టారు.
గన్ మేన్ల విషయంలో నెల్లూరు పోలీసులు అబద్ధాలు ఆడుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ‘‘నేను మాత్రం తగ్గేదే లేదు. ఇది సినిమా డైలాగు అనుకోవద్దు’’ అని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. మరింత కసితో ఇంకా ముందుకు పోతానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు కార్యకర్తలు.. అభిమానులే రక్ష అని అన్నారు. తాడో పేడో తేల్చుకుంటానని తేల్చి చెప్పారు.
తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో అదనపు భద్రత కల్పించాల్సింది పోయి ఉన్న గన్‌మెన్లను తొలగిస్తారా? అని ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారో తెలియదని.. కానీ ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే ఇలా జరగదని అన్నారు. ఇకపై ఎక్కడైనా ఒంటరిగా తిరుగుతానని, ఏం భయపడబోనని అన్నారు. గన్‌మెన్‌లు చాలా బాధతో వెనక్కి వెళ్లారని, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మానసికంగా బలహీనపడబోనని అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తానని, తన గొంతు ఇంకా పెరుగుతుందని చెప్పారు. ఎంపీ రఘురామకృష్ణరాజు కంటే పదింతల వేధింపులు ఇకపై తనకు కూడా ఉంటాయని అన్నారు. తన ఖర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుందని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.
నలుగురి నుంచి ఇద్దరికి కుదింపు
ఏపీలో వైసీపీకి ఎదురు తిరిగిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సెక్యూరిటీ కట్ చేస్తూ వస్తోంది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఆల్రెడీ సెక్యూరిటీ తగ్గించారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా పోలీస్ సెక్యూరిటీ తగ్గించారు. దీనికి కారణం మాత్రం ఏపీ ప్రభుత్వం తెలపలేదు. ఈ మేరకు పోలీసులు కోటంరెడి భద్రతను తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చారు. ‘గడపగడపకు..’ కార్యక్రమం మొదలైనప్పటి నుంచే ఎమ్మెల్యే కోటంరెడ్డికి అదనంగా ఇద్దరు గన్ మేన్లను ఇచ్చామని, ఇప్పుడు తీసేస్తున్నామని పోలీసు వర్గాలు మాత్రం తెలిపాయి. కానీ, దీన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖండించారు. తనకు మొదటి నుంచి 2 ప్లస్ 2 గన్ మేన్లు ఉన్నారని చెప్పారు.
ప్రస్తుతం ఆయనకు 2 ప్లస్ 2 భద్రత ఉండగా.. ఇప్పుడు దాన్ని 1 ప్లస్ 1 కి మార్చారు. దీనికి సంబంధించి పోలీసులు పంపించిన ఉత్తర్వులపై కోటంరెడ్డితో సంతకం పెట్టించుకుని తీసుకెళ్లారు. ఇటీవల వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కూడా పోలీసులు భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే. రామనారాయణ రెడ్డి తర్వాత కోటంరెడ్డికి కూడా పోలీసులు భద్రత తగ్గించడం ఇప్పుడు సంచలనంగా మారింది. వీరిద్దరూ పార్టీ వీడేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే భద్రత కుదించినట్లు స్పష్టమవుతోంది.