ఏపీలో వైసీపీకి ఎదురు తిరిగిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సెక్యూరిటీ కట్ చేస్తూ వస్తోంది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఆల్రెడీ సెక్యూరిటీ తగ్గించారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా పోలీస్ సెక్యూరిటీ తగ్గించారు. దీనికి కారణం మాత్రం ఏపీ ప్రభుత్వం తెలపలేదు.


నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి భద్రతను ప్రభుత్వం కుదించింది. ఈమేరకు పోలీసులు కోటంరెడి భద్రతను తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం ఆయనకు 2 ప్లస్ 2 భద్రత ఉండగా.. ఇప్పుడు దాన్ని 1 ప్లస్ 1 కి చేర్చారు. దీనికి సంబంధించి పోలీసులు పంపించిన ఉత్తర్వులపై కోటంరెడ్డితో సంతకం పెట్టించుకుని తీసుకెళ్లారు. ఇటీవల వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కూడా పోలీసులు భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే. రామనారాయణ రెడ్డి తర్వాత కోటంరెడ్డికి కూడా పోలీసులు భద్రత తగ్గించడం ఇప్పుడు సంచలనంగా మారింది. వీరిద్దరూ పార్టీ వీడేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే భద్రత కుదించినట్లు స్పష్టమవుతోంది.


ఇదెక్కడి న్యాయం..


కోటంరెడ్డి, జగన్ కు ఎదురు తిరిగాడంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై నాయకులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జగన్ అభిమానిని అని చెప్పుకునే  ఓ వ్యక్తి నేరుగా కోటంరెడ్డికే ఫోన్ చేసి బెదిరించాడు. ఆయన్ను బండికి కట్టుకుని ఈడ్చుకెళ్తానన్నారు. ఈ దశలో కోటంరెడ్డికి భద్రత తగ్గించడం ఇప్పుడు విశేషం. బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఆయనకు మరింత సెక్యూరిటీ ఇవ్వాల్సింది పోయి భద్రత తగ్గిస్తారా అంటూ ఆయన అభిమానులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.


పార్టీ తనను అవమానించిందని, పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదన్న కారణంతో పార్టీ నుంచి దూరంగా జరగాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రోజూ తనపై చేసిన విమర్శలకు బదులిస్తున్నారు. మొదట్లో ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు వెల్లువెత్తగా, ఆ తర్వాత తనపై విమర్శలు చేసిన అనిల్, కాకాణి.. ఇతర నేతలకు ఆయన బదులిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.


మరోవైపు కోటంరెడ్డి తనను బెదిరిస్తున్నాడని, ఆయనపే పోలీసులకు ఓ కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు కూడా నమోదు చేశారు. కానీ తాను ఎవర్నీ బెదిరించలేదని, ఇంటికెళ్లి కార్పొరేటర్ తో, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వచ్చానన్నారు కోటంరెడ్డి.


తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోటంరెడ్డి.. కాకాణి, సజ్జలపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేయిస్తున్నారని మండిపడ్డారు కోటంరెడ్డి. తనకు సజ్జల ఫోన్ కాల్స్ చేయిస్తా, తన తరపున రూరల్ నియోజకవర్గంలోని తన అభిమానులు సజ్జలకు వీడియో కాల్స్ చేస్తారని హెచ్చరించారు. అయితే ఇప్పుడు కోటంరెడ్డి భద్రతను ప్రభుత్వం తగ్గించడం మాత్రం గమనార్హం. అసలే బెదిరింపు కాల్స్ వస్తున్న ఈ సందర్భంలో ఆయనకు భద్రత తగ్గిస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తేలాల్సి ఉంది.