నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికైన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పీడ్ పెంచారు. తొలిసారిగా కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టిన ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 26మంది అధికార పార్టీ కార్పొరేటర్లు ఉండగా వారిలో కేవలం 18మంది మాత్రమే ఆయన వద్దకు వచ్చారు. మిగతా వారంతా కోటంరెడ్డి టీమ్ లో ఉన్నారు.
వచ్చిన కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమైన ఆదాల.. గతంలో లాగా కాకుండా కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామన్నారు. వారికి సమస్యలుంటే నేరుగా తనకి కాల్ చేయాలని చెప్పారు. అధికారులతో చెప్పి పనులు చేపిస్తామన్నారు, కార్పొరేషన్ లో రెండు మూడు రోజుల్లో సమావేశం పెడతామని చెప్పారు. వారం రోజుల్లో డివిజన్లలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి అవసరమైన నిధులు తెస్తానన్నారు. తనతో కలసి రాని వారి స్థానాల్లో డివిజన్ ఇన్ చార్జ్ లను నియమిస్తామని హెచ్చరించారు.
కోటంరెడ్డితో ఎంతమంది..?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పార్టీని విడిపోయినా, కార్యకర్తలు స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, రూరల్ పరిధిలోని సర్పంచ్ లు, జడ్పీటీసీలు.. వీరంతా పార్టీతోనే ఉంటారని అధిష్టానం అంచనా వేసింది. అయితే మొదటి రెండురోజుల్లో నాయకులంతా కోటంరెడ్డి ఆఫీస్ లో కనిపించారు. ఆ తర్వాతే మెల్లమెల్లగా వారిలో చలనం మొదలైంది.
విజయ భాస్కర్ రెడ్డితో మొదలు..
విజయ భాస్కర్ రెడ్డి అనే కార్పొరేటర్, తన కార్యాలయంలో కోటంరెడ్డి బ్యానర్లు, ఫ్లెక్సీలు తీసేయించిన తర్వాత అసలు కథ మొదలైంది. ఆయన ఇంటికెళ్లి కోటంరెడ్డి విచారించడం, ఆ తర్వాత కోటంరెడ్డిపై సదరు కార్పొరేటర్ కిడ్నాప్ కేసు పెట్టడంతో ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. కోటంరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి తానెవర్నీ బెదిరించలేదన్నారు. అవసరమైతే తనపై హత్యాయత్నం కేసు కూడా పెట్టుకోవచ్చని చెప్పారు. అయితే విజయ భాస్కర్ రెడ్డి మాత్రం తాను వైసీపీలోనే ఉంటానని, కోటంరెడ్డి కోటరీలో చేరేది లేదన్నారు. ఆ తర్వాత బొబ్బల శ్రీనివాస్ యాదవ్ వంటి కరడుగట్టిన కోటంరెడ్డి అభిమాని కూడా ఆదాల గూటికే చేరుకున్నారు. ఆయనతోపాటు కోటంరెడ్డి సపోర్ట్ తోనే ఎదిగిన మహిళ కార్పొరేటర్లు కూడా ఆదాలకు జై అన్నారు. ఇలా ఒక్కొక్కరే ఆదాల క్యాంప్ కి వచ్చేశారు. ప్రస్తుతం రూరల్ పరిధిలో 26 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో 18మంది ఆదాల దగ్గరకు వచ్చి చేరారు.
మేయర్ ఎటు..?
ఎవరు ఎటు ఉన్నా నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి.. తాను కోటంరెడ్డి వెంటే ఉంటానని చెప్పారు. తమకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఆయన్ని వదిలిపెట్టి వెళ్లేది లేదన్నారు. దీంతో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. అయితే మేయర్ కి కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు బాలినేని. మేయర్ సహా మిగతా కార్పొరేటర్లంతా సీఎం జగన్ నిర్ణయం మేరకు ఆదాల క్యాంప్ లోకి రావాల్సిందేనన్నారు. తాజాగా ఆదాల కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. తనతోపాటు కార్పొరేటర్లు కలసి రాకపోతే.. వారి వార్డుల్లో ఇన్ చార్జ్ లను ప్రకటిస్తామని కాస్త గట్టిగానే హెచ్చరించారు. తనతోపాటు కలసి వచ్చే కార్పొరేటర్లందకీ త్వరలో సీఎం జగన్ తో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయిస్తామన్నారు. అందరినీ పార్టీ గుర్తు పెట్టుకుంటుందని భరోసా ఇచ్చారు.