ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బరిలో లేకపోయినా.. ఆత్మకూరు ఉప ఎన్నికను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించింది. భారీ విజయానికి పక్కాగా స్కెచ్ వేసింది. లక్ష ఓట్ల మెజార్టీని టార్గెట్ గా పెట్టుకున్న నేతలు.. ఈనెల 10నుంచి నేరుగా ప్రచార బరిలో దిగబోతున్నారు.
ఆత్మకూరు ఉప ఎన్నికలను వైసీపీ అంత తేలిగ్గా తీసుకునేలా లేదు. పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగుతోంది. ఉప ఎన్నికల నామినేషన్ ఘట్టం పూర్తవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలతో ఇన్ చార్జ్ లను నియమించారు. ఈనెల 23న పోలింగ్ జరగాల్సి ఉండగా.. 10వ తేదీనుంచి ఇన్ చార్జ్ లు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగబోతున్నారు. ప్రచార పర్వంలో కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు. ఆత్మకూరు ఉప ఎన్నికలకు సంబంధించి ఇన్ చార్జిలతో ఆయా మండలాల నాయకుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, మరో మంత్రి రోజా.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆత్మకూరులో అధికార వైసీపీ లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్ గా పెట్టుకుంది.
ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రి, ఒక ఎమ్మెల్యేని ఇన్ చార్జి లుగా నియమించారు. మొత్తం ఆరు మండలాలకు సంబంధించి ఇన్చార్జిల నియామకం పూర్తయింది.
అనంతసాగరం మండలం - మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ఏఎస్ పేట మండలం - మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
ఆత్మకూరు టౌన్ - మంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే శ్రీకాంత్
ఆత్మకూరు రూరల్ - మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
చేజర్ల మండలం - మంత్రి రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని
మర్రిపాడు మండలం - మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
సంగం మండలం - మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.
ఇక ఉప ఎన్నికల సమన్వయకర్తగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, రాజ్య సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహరించబోతున్నారు.
నామినేషన్ల వివరాలివి..
ఆత్మకూరు ఉప ఎన్నికలకు నేటితో నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు ఏకంగా 15మంది నామినేషన్లు వేశారు. దీంతో మొత్తంగా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో 28 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్క్రూట్నీ మంగళవారం నుంచి మొదలవుతుంది. ఈనెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో ఫైనల్ లిస్ట్ ని ఆరోజు విడుదల చేస్తామని చెబుతున్నారు అధికారులు. ఈనెల 23న ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. 26వతేదీన ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.